అహ్మదాబాద్ : గత 20 రోజుల్లో 21 సింహాలు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మృతిచెందిన 20 సింహాలు గుజరాత్, అమ్రేలి జిల్లా పరిధిలోని గిర్ అడువిలోనివే కావడం చర్చనీయాంశమైంది. ఇక అధికారులు మాత్రం వైరల్ ఇన్‌ఫెక‌్షన్‌తో సింహాలు మృత్యువాత పడ్డాయని చెబుతున్నారు. అటవిశాఖ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12 నుంచి 19 మధ్య మొత్తం 11 సింహాలు మృతి చెందాయన్నారు. ఇందులో 7 అడవిలోనే మృతి చెందగా.. మరో నాలుగు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాయని తెలిపారు.
20 నుంచి 30 మంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సింహాలకు ట్రీట్‌మెంట్ అందజేశామన్నారు. చికిత్స సమయంలోనే మరో 10 సింహాలు మృత్యువాత పడ్డాయని, ఇది గిరి అడవుల్లోనే తీవ్ర విషాదం నింపిందన్నారు. వైరస్ వల్లనే సింహాలు మృతి చెందాయని, అది ఏం వైరసో ఇంకా నిర్దారణ కాలేదన్నారు. కేవలం ఈ ప్రాంతంలోనే సింహాలు మృతి చెందాయని స్పష్టం చేశారు. వీటిలో ఆరు సింహాలు మాత్రం ప్రొటోజోవా అనే వైరస్‌తో మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. మృతి చెందిన సింహాల నుంచి సాంపుల్స్ తీసుకున్నామని, వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ) పుణె పరిశీలిస్తుందన్నారు.
‘సింహాల మరణాల సంఖ్య 21కు చేరింది. ఏడు సింహాలు చికిత్స పొందుతూ మృతి చెందాయి. వైరస్ వల్ల మృతి చెందాయని గుర్తించాం. ఏ వైరసో కనుక్కోవడానికి కొంత సమయం పడుతోంది.’ అని జునగాద్ విల్డ్‌లైఫ్ సర్కిల్ ఛీఫ్ డీటీ వసవాడ మీడియాకుతెలిపారు. ఇక సింహాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాటికి సంబంధించిన ప్రత్యేకమైన మెడిసిన్స్, వ్యాక్సిన్స్‌ను అమెరికా నుంచి తీసుకురావాలని కూడా నిర్ణయించింది. 2015 లెక్కల ప్రకారం 523 సింహాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 600కు పెరిగందని అటవీ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment