Gir forest
-
రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి
అహ్మదాబాద్: దేశమంతా ప్రస్తుతం వైల్డ్‌లైఫ్ వారోత్సవాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలోనే గుజరాత్ గిర్ ఫారెస్ట్‌లో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. 32 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. గిర్ ఫారెస్ట్‌లో పనిచేసే ఒక వ్యక్తి తన పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. అయితే అతను వెళ్లే మార్గ మధ్యలో కొన్ని సింహాలు కూర్చొని ఉన్నాయి. అయితే అతను ఆ సింహాలతో గుజరాతీలో మాట్లాడాడు. తాను తన పనిని ముగించుకున్నానని, ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని వాటితో చెప్పాడు. A Gir Forest employee finds a lion on road. He tries to explain in Gujarati, the lion that he has been working whole day and requests to now kindly let him go home.And,the King of Jungle obliges... A beautiful example of harmonious co-existence#wildlifeweek2020 pic.twitter.com/QptdL4bMla — Prakash Javadekar (@PrakashJavdekar) October 7, 2020 తాను పని చేసి అలిసిపోయానని, తనకు వెళ్లడానికి దారినివ్వాలని వాటిని కోరాడు. అయితే ఆ తరువాత ఆ సింహాలు ఏం చేశారో చూస్తే మీరు అవాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే మనుషులను చూడగానే పైకి వచ్చి చంపేసే సింహాలు అతనికి దారి నిచ్చి ఆ మార్గం నుంచి తప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ‘సామరస్యపూర్వక సహజీవనానికి అందమైన ఉదాహరణ’ ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అందాల పోటీలో ఆంధ్రా సీతాకోకచిలుకలు -
సింహాల గణనకు కొత్త విధానం
డెహ్రడూన్: దేశంలో సింహాల సంఖ్యను లెక్కించేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. దీంతో వాటి సంరక్షణ చర్యలు సమర్థంగా చేపట్టొచ్చని చెబుతున్నారు. సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఉన్న 50 ఆసియా సింహాల సంఖ్య ప్రస్తుతం 500 వరకు పెరిగినట్లు వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కేశబ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న లెక్కింపు విధానాల వల్ల కొన్ని సింహాలను లెక్కించకపోవచ్చు. లేదా డబుల్ కౌంటింగ్ జరగొచ్చు.. దీనివల్ల వాటి సంఖ్య వివరాలు పరిమితంగానే తెలుస్తాయి. అందుకే ఆయన సహచరులు కలసి కంప్యూటర్ ప్రోగ్రాం ఉపయోగించి లెక్కించే కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో సింహం ముఖంపై ఉన్న మీసాలు, శరీరంపై ఉన్న మచ్చల ఆధారంగా గుర్తిస్తారు. సింహాల ఆహార లభ్యత, ఇతర కారకాలు సింహాల సంఖ్యను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేశబ్ చెప్పారు. తాజా అధ్యయనంలో గిర్ అడవుల్లో 368 సింహాల్లో 67 సింహాలను 725 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో గుర్తించారు. -
వైరల్ : అడ్డు తప్పుకున్న ఆడ సింహం..!
-
వైరల్ : అడ్డుతప్పుకున్న ఆడ సింహం..!
అహ్మదాబాద్ : మనిషికి జంతువులకు ఉన్న ప్రధాన తేడా విచక్షణ..! అందువల్లే ఏది మంచి, ఏది చెడు అని మనుషులు ఆలోచించగలుగుతారు. కానీ, నేటి (అ)నాగరిక పోకడలు మనిషి ప్రవర్తన పశువులా మారిందనడానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. నేరాలు-ఘోరాల సంగతి అంటుంచితే.. కనీసం రోడ్డు భద్రతా నియమాలు కూడా మనకు బరువేనని రుజువు చేస్తాయి. అయితే, గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో వెలుగుచూసిన ఓ అరుదైన దృశ్యం మాత్రం క్రూర జంతువులు కూడా విచక్షణతో మసలుకుంటాయని నిరూపించింది. రెండు పిల్లలతో కలిసి అడవిలో వెళ్తున్న ఓ ఆడ సింహం.. అదే తోవలో బైక్‌పై ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తికి అడ్డు తప్పుకుని దారిచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్యసభ ఎంపీ పరిమల్ నాథ్వాని దీని గురించి చెప్తూ.. ‘ఈ వైరల్ వీడియో చూడండి. పిల్లలతో కలిసి అడవిలో వెళ్తున్న ఓ ఆడసింహం.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై రావడంతో దారి ఇచ్చింది. మనుషుల జీవన విధానానికి జంతువులెప్పుడూ ప్రాధాన్యం ఇస్తాయి. ఇదెంతో అద్భుతంగా ఉంది ’అని క్యాప్షన్ జోడించారు. -
జనావాసాల్లోకి ఏడు సింహాలు
గిరినగర్: గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జునాగఢ్‌లోని గిరినగర్ వీధుల్లో గత శుక్రవారం రాత్రి ఏడు సింహాలు చక్కర్లు కొట్టాయి. జనావాసాల మధ్య హాయిగా తిరిగాయి. దీన్ని ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మధ్యమాల్లో పోస్ట్‌చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, సింహాలను అడవిలోకి తోలారు. కాగా, ఈ విషయమై జునాగఢ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(డీసీఎఫ్) ఎస్కే బేర్వాల్ మాట్లాడుతూ.. గిర్ అభయారణ్యం సమీపంలోనే ఉండటంతో ఈ సింహాల గుంపు జనావాసాల మధ్యకు వచ్చిందని తెలిపారు. వర్షాలు పడినా, పడకున్నా సింహాలు అలా స్వేచ్ఛగా తిరుగుతాయనీ, అది వాటి స్వభావమని వివరణ ఇచ్చారు. ఈ సింహాలన్నీ క్షేమంగానే ఉన్నాయని తేల్చిచెప్పారు. 2015 నాటి లెక్కల ప్రకారం గిర్ అభయారణ్యంలో 523 ఆసియా సింహాలు ఉన్నాయి. -
‘ఇది శాఖాహార సింహం అనుకుంటా’
-
‘ఇది శాఖాహార సింహం అనుకుంటా’
గాంధీనగర్: మృగరాజు సింహం విషయంలో తరచుగా ఓ మాట వింటుంటాం. ఆకలేసినంత మాత్రానా సింహం గడ్డి తినదని. కానీ ఈ వీడియో చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఈ సింహం తాపీగా గడ్డి నముల్తుంది కాబట్టి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ వింత సంఘటన గిర్ అడవుల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గుజరాత్లో గిర్ అభయారణ్యంలో ఓ సింహం గడ్డి తింటూ వీడియోకు చిక్కింది. సింహం గడ్డిని నమిలి, బయటకు ఉమ్మేయడం వీడియోలో రికార్డయ్యింది. దాన్ని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇది శాఖహార మృగరాజేమో’.. ‘ఈ సింహం భార్య డైటింగ్ చేయమన్నట్లుంది. అందుకే ఇలా గడ్డి తింటుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే జంతుశాస్త్రం తెలిసిన వారు మాత్రం ఇది అంత ఆశ్చర్యపోవాల్సిన సంఘటనేం కాదు అంటున్నారు. పేగులను శుభ్రం చేసుకోవడానికి గాను సింహాలు ఇలా గడ్డిని తింటాయన్నారు. పిల్లి జాతికి చెందిన అన్ని జీవులు గడ్డిని భేదిమందు(విరేచనాలు)గా సేవిస్తాయన్నారు. సింహం లాంటి మాంసాహార జంతువులు ఓ జీవిని చంపి ఆహారంగా తీసుకున్నప్పుడు.. అది అరగకపోతే ఇలా గడ్డిని తింటాయి. ఆ రసం భేది మందుగా పని చేస్తుంది. అందుకే సింహం గడ్డిని నమిలి.. చివరకు బయటకు ఉమ్మేసింది అని తెలిపారు. దీని గురించి షెత్రుంజి రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సింహాల కడుపులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాంతులు చేసుకునేందుకు అప్పుడప్పుడు గడ్డి తింటుంటాయని పేర్కొన్నారు. పచ్చిమాంసం కొన్నిసార్లు వాటి జీర్ణక్రియను ఇబ్బంది పెడుతుందని, అటువంటి సమయంలో దానిని మళ్లీ బయటకు పంపేందుకు ఇలా గడ్డి తింటాయని వివరించారు. ఏది ఏమైనా సింహం గడ్డి తినడం నిజంగా చాలా అరుదైన సంఘటనగానే చెప్పవచ్చు. -
సింహానికి చిరుత దత్తత!
అహ్మదాబాద్: సాధారణంగా చిరుతపులులను చూస్తే సింహాలు వేటాడతాయి. అయితే గుజరాత్లో ఓ ఆడ సింహం చిరుత పులి పసికూనను కంటికి రెప్పలా చూసుకుంటూ దానికి పాలు కూడా ఇస్తోంది. ఇలా జరగడం చాలా అసాధారణమని అటవీ అధికారులు చెబుతున్నారు. నెలన్నర వయసున్న చిరుతకూన గిర్ అడవిలో ఎలానో తన తల్లి నుంచి వేరుపడింది. దీనిని సింహం అక్కున చేర్చుకుంది. తన పిల్లలతోపాటే దీనికీ పాలిస్తూ, మగ సింహాల దాడి నుంచి కాపాడుతోంది. వారం క్రితం ఈ వింతను అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా విడుదల చేశారు. ‘చిరుతపులి పిల్లపై ఈ సింహం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ కాపాడుతోంది. అలాగే సింహం సంకేతాలు, శబ్దాలను పులి పిల్ల ఎలా అర్థం చేసుకుంటుందోనని మేం ఆశ్చర్యపోతున్నాం. ఏదేమైనా ఇది చాలా అరుదైన ఘటన’ అని గిర్ అడవి పశ్చిమ విభాగ కన్జర్వేటర్ ధీరజ్ మిత్తల్ చెప్పారు. -
వైరల్: సింహంతో ఆట.!
అహ్మదాబాద్ : బోన్లో ఉన్న సింహాం దగ్గరకు వెళ్లాలంటేనే గజ్జున వణుకుతాం.. అలాంటిది ఓ వ్యక్తి ఆ సింహాతోనే ఓ ఆట ఆడాడు. ఇంట్లో పెంపుడు కుక్కతో ఆడుకున్నట్టు సదరు వ్యక్తి సింహంతో ఆడుకున్నాడు. పైగా అదేమన్న పెంపుడు సింహామా అంటే అదికాదు.. సింహాలకు కేరాఫ్ అడ్రసైన గుజరాత్ గిర్ ఫారెస్ట్ మృగరాజది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి ఏంచక్కా కుర్చీలో కూర్చోని.. చేతిలో ఓ కోడిపిల్లను పట్టుకోని.. సింహానికి ఎరగా ఆశ చూపిస్తూ.. వెనక్కు ముందు జరుపుతూ.. ఓ ఆట ఆడాడు. ఆకలితో ఉన్న ఆ మృగరాజు ఆ వ్యక్తి చేతిలో కోడిని లటుక్కునందుకోని గుటుక్కుమంది. ఇక ఇలాంటి ఘటనలు ఇదే తొలిసారేం కాదు. ఇదే తరహా వీడియో గతంలో కూడా వైరల్ అయింది. అప్పట్లో ఆ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దానికి సంబంధించిన ఏడుగురిపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇక గతనెలలో గిర్ అడవుల్లో వైరస్ సోకి 23 సింహాలు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో మేలుకున్న ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. ఆనారోగ్యానికి గురైన సింహాలను గుర్తించి చికిత్స అందిస్తున్నాయి. ఈ వ్యవహారంపై గుజరాత్ హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: సీడీవీ వైరస్‌తోనే గిర్ సింహాల మృతి) -
‘మృగరాజు రక్షణకు వెయ్యికోట్లు ఇవ్వండి’
అహ్మదాబాద్ : అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న గుజరాత్ గిర్ మృగరాజుల రక్షణకు తక్షణమే వెయ్యి కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అలాగే వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ, పర్యవేక్షణ లోపంతోనే సింహాలు మృతి చెందాయని ఆరోపించారు. గిర్ అటవీ సమీపంలోని అక్రమ రిసార్ట్స్‌లను వెంటనే తొలిగించాలని, గుజరాత్ సింహాల రక్షణ కోసం వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గుజరాత్ సింహాలకు పులులకిచ్చే ప్రాధాన్యతనే ఇస్తూ.. టైగర్ ప్రాజెక్ట్‌లా.. లయన్స్ ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు. (చదవండి: మృగరాజుకు వైరస్ సోకిందా?) మోదీకి ఓ గుజరాతీగా.. గిర్ సింహాలు గుజరాత్ ఆత్మగౌరవమనే విషయం తెలుసన్నారు. వాటి రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్‌ను తెప్పించాలని, సింహాల కోసం వెటర్నరీ డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్‌తో దాదాపు 15 రోజుల్లోనే 23 సింహాలు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్ ఈ మరణాలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: వైరస్‌తోనే గిర్ సింహాల మృతి) చదవండి: మృగరాజుకు ఎంత కష్టం! -
సీడీవీ వైరస్‌తోనే గిర్ సింహాల మృతి
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో చనిపోయిన 23 ఆసియా జాతి సింహాల్లో ఐదు సింహాలను ప్రమాదకర కెనైన్ డిస్టెంపర్ వైరస్(సీడీవీ) బలికొందని భారత వైద్య పరిశోధన మండలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ–పుణె) తెలిపాయి. సింహాల మృత కళేబరాల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఈ ప్రమాదకరమైన వైరస్ కారణంగా తూర్పు ఆఫ్రికాలో ఉన్న సింహాల్లో 30 శాతం అంతరించిపోయాయని పేర్కొన్నాయి. గిర్ అభయారణ్యంలో గత నెల 12 నుంచి ఇప్పటివరకూ 23 సింహాలు చనిపోయాయి. ఈ నేపథ్యంలో నమూనాలను సేకరించిన భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్).. సీడీవీ వైరస్‌ను ధ్రువీకరించింది. గాలితో పాటు ప్రత్యక్షంగా తాకడం ద్వారా జంతువుల్లో ఈ వైరస్ సోకుతుంది. దీంతో అధికారులు మిగతా సింహాలకు ఈ వ్యాధి వ్యాపించకుండా వాటిని వేరే జూలకు తరలించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఐసీఎంఆర్ విజ్ఞప్తితో కేంద్రం సీడీవీ టీకాను శుక్రవారం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. గిర్ అభయారణ్యంలో దాదాపు 600 ఆసియా జాతి సింహాలున్నాయి. సాధారణంగా సీడీవీ వైరస్ పెంపుడు కుక్కల్లో కనిపిస్తుంది. తోడేలు, నక్క, రకూన్, ముంగిస, రెడ్ పాండా, హైనా, పులి, సింహం వంటి మాంసాహార జంతువులకూ సోకుతుంది. ఇది సోకిన జంతువుల్లో 50 శాతం చనిపోతాయి. చికిత్స ద్వారా కోలుకున్నా చూపును కోల్పోవడం, మూర్ఛ రావడం, వేటాడే శక్తిలేక నిస్తేజంగా మారిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ మనుషులపై ప్రభావం చూపదు. -
మృగరాజుకు వైరస్ సోకిందా?
అహ్మదాబాద్ : గత 20 రోజుల్లో 21 సింహాలు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మృతిచెందిన 20 సింహాలు గుజరాత్, అమ్రేలి జిల్లా పరిధిలోని గిర్ అడువిలోనివే కావడం చర్చనీయాంశమైంది. ఇక అధికారులు మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్తో సింహాలు మృత్యువాత పడ్డాయని చెబుతున్నారు. అటవిశాఖ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12 నుంచి 19 మధ్య మొత్తం 11 సింహాలు మృతి చెందాయన్నారు. ఇందులో 7 అడవిలోనే మృతి చెందగా.. మరో నాలుగు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాయని తెలిపారు. 20 నుంచి 30 మంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సింహాలకు ట్రీట్మెంట్ అందజేశామన్నారు. చికిత్స సమయంలోనే మరో 10 సింహాలు మృత్యువాత పడ్డాయని, ఇది గిరి అడవుల్లోనే తీవ్ర విషాదం నింపిందన్నారు. వైరస్ వల్లనే సింహాలు మృతి చెందాయని, అది ఏం వైరసో ఇంకా నిర్దారణ కాలేదన్నారు. కేవలం ఈ ప్రాంతంలోనే సింహాలు మృతి చెందాయని స్పష్టం చేశారు. వీటిలో ఆరు సింహాలు మాత్రం ప్రొటోజోవా అనే వైరస్‌తో మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. మృతి చెందిన సింహాల నుంచి సాంపుల్స్ తీసుకున్నామని, వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) పుణె పరిశీలిస్తుందన్నారు. ‘సింహాల మరణాల సంఖ్య 21కు చేరింది. ఏడు సింహాలు చికిత్స పొందుతూ మృతి చెందాయి. వైరస్ వల్ల మృతి చెందాయని గుర్తించాం. ఏ వైరసో కనుక్కోవడానికి కొంత సమయం పడుతోంది.’ అని జునగాద్ విల్డ్‌లైఫ్ సర్కిల్ ఛీఫ్ డీటీ వసవాడ మీడియాకుతెలిపారు. ఇక సింహాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాటికి సంబంధించిన ప్రత్యేకమైన మెడిసిన్స్, వ్యాక్సిన్స్‌ను అమెరికా నుంచి తీసుకురావాలని కూడా నిర్ణయించింది. 2015 లెక్కల ప్రకారం 523 సింహాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 600కు పెరిగందని అటవీ శాఖ పేర్కొంది. చదవండి: 11 సింహాలు మృత్యువాత -
11 సింహాలు మృత్యువాత
రాజ్‌కోట్: గుజరాత్‌లోని గిర్ అడవుల్లో కొద్ది రోజుల వ్యవధిలోనే 11 సింహాలు మృతి చెందడం సంచలనంగా మారింది. అంతరించిపోతున్న సింహాల్ని కాపాడటానికి చర్యలు చేపడుతున్నామని చెబుతున్న అటవీశాఖ అధికారులు వాటి సంరక్షణకు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది. మృతిచెందిన 11 సింహాలను కూడా అమ్రేలి జిల్లా పరిధిలోని గిర్ తూర్పు డివిజన్లో గుర్తించారు. వాటి నమునాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జునాగఢ్ వెటర్నిటీ ఆస్పత్రికి తరలించామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 8 సింహాలు వాటి మధ్య పోరు కారణాంగానే మరణించి ఉంటాయని వాటి పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మిగతా మూడింటి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై లోతైన విచారణ చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని డిమాండ్ చేశారు. అవి ఏ కారణం చేత మరణించాయో(విద్యుద్ఘాతం, విషప్రయోగం, వేట) తెల్చాలని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, 2015 లెక్కల ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి. -
వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సింహాలతోనే..!
అహ్మదాబాద్: సింహాలను చూస్తేనే చాలామంది దడుసుకొని ఆమడ దూరం పారిపోతారు. కానీ కొందరు యువకులు మాత్రం సింహాలను చూసి వెర్రిగా ప్రవర్తించారు. సింహాలను బైకుల మీద వెంటాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని ప్రముఖ గిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బైకర్లు సింహాలను వెంటాడుతూ ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లో బంధించారు. మీదమీదకు వస్తున్న బైకర్ల నుంచి తప్పించుకునేందుకు ఓ సింహం, ఓ ఆడసింహం అడవిలోకి పారిపోయాయి. అమ్రేలి జిల్లాలోని అడవిలో చిత్రీకరించినట్టు భావిస్తున్న 34 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్బుక్లో, యూట్యూబ్‌లో ఈ వీడియోను హల్చల్ చేస్తున్న నేపథ్యంలో గుజరాత్ అటవీశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. బైకర్ల వివరాలు తెలుసుకొని.. వీడియో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీడియోలో ఒక బైక్ నంబర్ కనిపించడంతో ఈ వివరాల ఆధారంగా విచారణ చేపడుతున్నారు. -
దోషులెవరో తేలిపోయింది..
దోషులెవరో తేలిపోయింది.. హంతకుల గుట్టురట్టయింది. ఆరుగురిని చంపిన కేసులో మూడు సింహాలకు జైలు శిక్ష పడింది!! గుజరాత్‌లోని గిర్ జాతీయ పార్కుకు సమీపంలోని గ్రామాలకు చెందిన ఆరుగురిని సింహాలు చంపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డౌట్ ఉన్న 18 సింహాలను జూ అధికారులు అదుపులోకి తీసుకుని.. వాటి పాదముద్రల నమూనాలు తీసుకున్నారు. చివరికి మూడు సింహాలను దోషులుగా తేల్చారు. ఇందులో ఒక మగ సింహం, రెండు ఆడసింహాలు ఉన్నాయి. ప్రధాన దోషి మగ సింహమేనని.. అది పలుమార్లు చేసిన దాడుల్లో ఆరుగురిని చంపేసిందని జూ అధికారులు తెలిపారు. ఆడ సింహాలు ఈ నేరంలో పాలుపంచుకున్నాయని.. మగ సింహం తినేసి వదిలేసిన మృతదేహాలను అవీ తిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మగ సింహాన్ని జూకు తరలించి.. బోనులో బంధించారు. ఆడ సింహాలను రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. నిర్దోషులుగా తేలిన మిగిలిన సింహాలను పార్కులోకి వదిలి స్వేచ్ఛను ప్రసాదించారు. -
ఆ సింహాలు గడగడ వణికిపోతున్నాయి!
మనం చూస్తున్నామని.. ఇలా గంభీరంగా నిల్చున్నట్లు స్టిల్లు పెట్టాయి గానీ.. లోపల ఇవి గడగడ వణికిపోతున్నాయి.. ఈ రెండే కాదు.. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్కులోని 18 మృగరాజులది ఇదే పరిస్థితి. ఎందుకంటే.. ప్రస్తుతం ఇవి హత్య కేసును ఎదుర్కొంటున్నాయి. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ.. 18 సింహాల ‘అరెస్టు’ జరిగింది కూడా.. నేర నిరూపణ కోసం ఫింగర్ ప్రింట్లు తీసుకునే పని మొదలైంది. దోషిగా తేలిన సింహం.. ‘కటకటాల’ వెనక్కు వెళ్లాల్సిందేనట.. జైలు శిక్ష అనుభవించాల్సిందేనట.. మిగిలిన వాటిని నిర్దోషులుగా రిలీజ్ చేస్తారట. సింహాలపై హత్య కేసా.. అరెస్టులా.. జైలా.. ఏమిటిది అని అనుకుంటున్నారా? అయితే.. అసలు విషయంలోకి వెళ్లిపోదామా.. గిర్ నేషనల్ పార్కు సమీపంలోని గ్రామాల్లో ఇటీవల ఆరుగురు సింహం దాడిలో చనిపోయారు.. దీంతో అటవీ శాఖ అధికారులు డౌట్ ఉన్న 18 సింహాలను అదుపులోకి తీసుకున్నారు. వాటి పాదముద్రలను తీసుకునే పనిలో పడ్డారు. శాస్త్రీయపరమైన విశ్లేషణ అనంతరం హత్యలకు పాల్పడ్డ సింహం గుట్టు తేలుస్తారట. దోషిగా తేలినదాన్ని శాశ్వతంగా జూకు తరలించి.. బోనులో బంధిస్తారు. మిగిలిన వాటిని గిర్ పార్కులోకి మళ్లీ వదిలేసి స్వేచ్ఛను ప్రసాదిస్తారట. -
బర్రెను చూసి సింహం తుర్రుమంది!
అడవికి ఓ న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం అడవికి రాజు సింహం. దానిని చూసి అన్నీ జంతువులు భయపడాల్సిందే. ఎదైనా జంతువు ఎదురుతిరిగి నువ్వెంత అని కొమ్ములు ఎగరేస్తే.. సింహం తన పంజా విసురుతుంది. ఎదురుగా జంతువు కనిపిస్తేనే దానికి ఆహారంగా మారిపోతుంది. అలాంటిది ఎదురుతిరిగితే బతికి బయటపడగలదా? కానీ ఇక్కడ మాత్రం ఆటవిక న్యాయం తిరగబడింది. బర్రె (గెదే)ను చూసి ఆడ సింహం ఒకటి భయపడింది. గెదే మీదకు ఉరికొస్తుంటే.. సింహం బెదిరి పోరిపోయింది. ఆ సింహాన్ని వెంటాడి మరీ గెదే తరిమేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ అడవిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన నాటకీయ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. #WACTH Law of the jungle turns - dramatic visuals of a buffalo chasing a lioness into the wild in Gir Forest (Guj)https://t.co/JuKJnQPG4X — ANI (@ANI_news) June 5, 2016 -
అడవిరాజాతో క్రికెట్ కింగ్!
గిర్ అడవుల్లో సచిన్ షికారు రాజ్‌కోట్: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు పూర్తిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులకే తన సమయాన్ని కేటాయిస్తున్నాడు. వారితో కలిసి వేర్వేరు ప్రాంతాల్లో షికారు చేస్తున్నాడు. శనివారం సచిన్ తన ఫ్యామిలీతో కలిసి ఆసియా సింహాలకు ప్రసిద్ధికెక్కిన గిర్ అడవులను సందర్శించాడు. అందులో సింహాలు ఎక్కువగా సంచరించే 15 చోట్లకు అధికారులు సచిన్‌ను తీసుకెళ్లారు. భార్య అంజలి, పిల్లలు అర్జున్, సారాలతో పాటు కొంత మంది స్నేహితులతో కలిసి సచిన్ సౌరాష్ట్ర ప్రాంతంలో రెండు రోజుల సందర్శనకు వచ్చాడు. శుక్రవారం కేంద్ర పాలిత ప్రాంతం డామన్ అండ్ డయ్యుకు అతను వెళ్లాడు. గిర్ అడవుల సందర్శన పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. సింహాల సంరక్షణపై శ్రద్ధ తీసుకుంటున్న అధికారులను అభినందించాడు. ‘నాకు ఇదో మంచి అనుభవం. పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఈ అడవులు, సింహాల గురించి చదివా. ఇన్నాళ్లకు రాగలిగా. ఇక్కడ సింహాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి అధికారుల సమర్థ నిర్వహణే కారణం’ అని వ్యాఖ్యానించాడు.