మనం చూస్తున్నామని.. ఇలా గంభీరంగా నిల్చున్నట్లు స్టిల్లు పెట్టాయి గానీ.. లోపల ఇవి గడగడ వణికిపోతున్నాయి.. ఈ రెండే కాదు.. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్కులోని 18 మృగరాజులది ఇదే పరిస్థితి. ఎందుకంటే.. ప్రస్తుతం ఇవి హత్య కేసును ఎదుర్కొంటున్నాయి. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ.. 18 సింహాల ‘అరెస్టు’ జరిగింది కూడా.. నేర నిరూపణ కోసం ఫింగర్ ప్రింట్లు తీసుకునే పని మొదలైంది. దోషిగా తేలిన సింహం.. ‘కటకటాల’ వెనక్కు వెళ్లాల్సిందేనట.. జైలు శిక్ష అనుభవించాల్సిందేనట.. మిగిలిన వాటిని నిర్దోషులుగా రిలీజ్ చేస్తారట. సింహాలపై హత్య కేసా.. అరెస్టులా.. జైలా.. ఏమిటిది అని అనుకుంటున్నారా? అయితే.. అసలు విషయంలోకి వెళ్లిపోదామా..
గిర్ నేషనల్ పార్కు సమీపంలోని గ్రామాల్లో ఇటీవల ఆరుగురు సింహం దాడిలో చనిపోయారు.. దీంతో అటవీ శాఖ అధికారులు డౌట్ ఉన్న 18 సింహాలను అదుపులోకి తీసుకున్నారు. వాటి పాదముద్రలను తీసుకునే పనిలో పడ్డారు. శాస్త్రీయపరమైన విశ్లేషణ అనంతరం హత్యలకు పాల్పడ్డ సింహం గుట్టు తేలుస్తారట. దోషిగా తేలినదాన్ని శాశ్వతంగా జూకు తరలించి.. బోనులో బంధిస్తారు. మిగిలిన వాటిని గిర్ పార్కులోకి మళ్లీ వదిలేసి స్వేచ్ఛను ప్రసాదిస్తారట.