దారుణం చేసిన 21 మంది విద్యార్థులపై వేటు
తిరువనంతపురం: కేరళలో ఓ జూనియర్ విద్యార్థిపై దారుణ చర్యలకు దిగిన 21 మంది సీనియర్ విద్యార్థులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కేరళలోని మలప్పురంలోని ఓకాలేజీలో జూనియర్ విద్యార్థిని దాదాపు ఐదు గంటలపాటు వివస్త్రుడిని చేయకూడని పనులు చేయించడంతో అతడి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు శరవేగంగా ముందుకు కదిలి విచారణ ప్రారంభించారు.
మొత్తం 40 మంది జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. తమందరిని బట్టలు విప్పించి టాయిలెట్లు క్లీన్ చేయించారని పోలీసులకు చెప్పారు. ఈ ఘటన విషయంలో ముగ్గురు ప్రొఫెసర్లను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. డిసెంబర్ 2న రాత్రి పూట తమ వద్దకు వచ్చిన సీనియర్లు బలవంతంగా మద్యం తాగించారని, చేయకూడని పనులు కూడా చేయించారని తెలిపారు. ర్యాగింగ్ కారణంగానే ఆ విద్యార్థి కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు తెలిపారు.