230 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు
సాక్షి, భువనేశ్వర్: ఒడిశాలోని రెండు వేర్వేరు పాఠశాలల్లో ఆహారం వికటించి సుమారు 230 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 150 మంది బాలికలు కావటం గమనార్హం. మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ ఏజెన్సీ ప్రాంతంలోని బడాపడా గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ఉదయం టిఫిన్ తిన్న అనంతరం 150 మంది బాలికలు వాంతులు, విరేచనాలతో సతమతమయ్యారు. వీరిని వెంటనే ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం చిత్రకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సుదర్శన్ చక్రవర్తి గురుకుల పాఠశాలను సందర్శించి, బాలికలకు ధైర్యం చెప్పారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మరో ఘటనలో..కలహండి జిల్లా లాంజిగర్హ్ బ్లాక్ పరిధిలోని లుమా, కుర్బి, బంధ్‌పారి, బస్వంత్‌పూర్, రాజేంద్రపూర్‌లలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. మొత్తం80 మందిని ఆస్పత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు డీఈవో తెలిపారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. కాగా, ఈ పాఠశాలలకు ఓ ట్రస్ట్ మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది.