రూ.1,500 కోట్లతో ‘నమామి గంగే’ ప్రారంభం
ఏడు రాష్ట్రాల్లో 231 ప్రాజెక్టులు షురూ
న్యూఢిల్లీ/హరిద్వార్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగే పథకం అమలును పరుగులు పెట్టించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం గురువారం 231 ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల్లో ఏడు రాష్ట్రాల్లోని వంద ప్రాంతాల్లో రూ.1500 కోట్లతో మురుగుశుద్ధి కేంద్రాలు, ఘాట్లను నిర్మించనున్నారు. గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో భాగంగా గంగానది ప్రవహించే ఐదు (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్) రాష్ట్రాల్లోని 103 చోట్ల, గంగకు ఉపనదైన యమున ప్రవహించే ఢిల్లీ, హరియాణాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు.
హరిద్వార్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, ఉమాభారతి, మహేశ్ శర్మతోపాటు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ 43 ప్రాజెక్టులు ప్రారంభించారు. గంగానదిలో కాలుష్యానికి గతంలో సరైన ప్రణాళికల్లేకుండా ముందుకెళ్లటమే కారణమని.. మోదీ సర్కారు హయాంలో అలాంటి పొరపాట్లకు తావులేకుండా పనిపూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి తెలిపారు.
నమామి గంగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ‘గంగా చట్టం’ తీసుకొస్తామన్న ఉమా.. పరిశ్రమలు వ్యర్థాలను గంగానదిలోకి విడుదల చేయకూడదని.. శుద్ధి చేసిన ఆ నీటి ని వ్యవసాయానికి వినియోగించాలన్నారు. గంగా స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహనకు అక్టోబరులో పాదయాత్ర చేపడతామన్నారు. ఈ ఏడాది చివరికల్లా 60 మురుగుశుద్ధి కేంద్రాలు ప్రారంభించనున్నట్లు గడ్కారీ తెలిపారు.