వైద్యుల ఆందోళనలు.. రోగులకు ఇబ్బందులు
ముంబై: మహారాష్ట్రలో వైద్యులకు కోపం వచ్చింది అంతే ఒకేసారి మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఈ సెలవులు వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇటీవల రెసిడెంట్ డాక్టర్లపై రోగుల బంధువులు దాడి చేసిన ఘటనలు అధికమవ్వడంతో డాక్టర్లు మూకుమ్మడి సెలవులు ప్రకటించారు. వైద్యులకు భద్రత కల్పించాలని, దాడిచేసే వారిపై కఠిన శిక్షలు అమలు చేసే చట్టాలు రూపోందించాలని రెసిడెంట్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
సుమారు 3000 మంది రెసిడెంట్ డాక్టర్లు క్యాజువల్ లీవ్ తీసుకున్నట్లు మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు స్వప్నిల్ మెశ్రామ్ తెలిపారు. కాగా వీరి ఆందోళనలకు వ్యతిరేకంగా ఓ సంఘ కార్యకర్త హైకోర్టులో ప్రజావాజ్యం పిటీషన్ దాఖలు చేశారు. గత వారం రోజుల్లో రెసిడెంట్ వైద్యులపై అయిదు దాడులు జరిగాయని, గడిచిన 48 గంటల్లోనే రెండు దాడులు జరిగాయని భారత మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ తెలిపారు.
అయితే సోమవారం ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ( బీఎంసీ) డాక్టర్లకు రక్షణగా కొన్ని ప్రతిపాదనలను సూచించింది. పేషంట్‌తో ఇద్దరు మాత్రమే ఉండాలిని, కుటుంబ సభ్యులను ఎవరిని అనుమతించవద్దనే నియమాన్ని ప్రవేశ పెట్టింది. ఎవరైన వెళ్లాలంటే ప్రత్యేక పాస్‌లు పొందాలని సూచించింది. బీఎంసీ కమిషనర్ ఐఏ కుందన్ మాట్లాడుతూ.. 4000 మెడికోలు క్యాజువల్ లీవ్‌లు ప్రకటించారని, వారితో చర్చలు జరుపుతున్నామని, వైద్యుల డిమాండ్లకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల వద్ద మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్‌ను నియమిస్తామని కుందన్ చెప్పారు. డాక్టర్ల ఆందోళనతో రోగులు చికిత్సకు దూరమై దయనీయ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. సుమారు 500 సర్జరీలు వాయిదా పడ్డాయి.