భారత్‌కు కెనడా యురేనియం | 3 thousand metric tons urenium agreement between India and canada | Sakshi
Sakshi News home page

భారత్‌కు కెనడా యురేనియం

Published Thu, Apr 16 2015 3:37 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

భారత్‌కు కెనడా యురేనియం - Sakshi

భారత్‌కు కెనడా యురేనియం

కెనడా పర్యటనలో అణు ఇంధన రంగానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ కీలక విజయం సాధించారు.

  • 3 వేల మెట్రిక్ టన్నుల సరఫరాకు అంగీకారం
  • భారత అణు ఇంధన రంగంలో మేలిమలుపు
  • కెనడా ప్రధాని హార్పర్‌తో మోదీ చర్చలు
  •  ఒటావా: కెనడా పర్యటనలో అణు ఇంధన రంగానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ కీలక విజయం సాధించారు. అణు విద్యుదుత్పత్తికి కీలకమైన యురేనియంను ఐదేళ్ల పాటు సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. ఈ చర్య ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో, పరస్పర విశ్వాస కల్పనలో ముఖ్యమైన ముందడుగుగా, భారత అణు ఇంధన రంగంలో మేలిమలుపుగా భావిస్తున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, జర్మనీల అనంతరం బుధవారం కెనడా చేరుకున్న మోదీ ఆ దేశ ప్రధాని స్టీఫెన్ హార్పర్‌తో అణు ఇంధనం సహా పలు కీలకాంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. అనంతరం కెనడాకు చెందిన కేమికొ కార్పొరేషన్ 3 వేల మెట్రిక్ టన్నుల యురేనియంను భారత్‌కు సరఫరా చేసేలా రూపొందించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ విషయాన్ని మోదీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న హార్పర్ ప్రకటించారు. ఈ సంవత్సరం నుంచి ప్రారంభించి ఐదేళ్లలో ఆ యురేనియంను భారత్‌కు అందిస్తారు.
     
    అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) భద్రతాప్రమాణాలను అనుసరించి ఈ సరఫరా ఉంటుంది. ఈ ఒప్పందం వ్యయం రూ. 15.85 వేల కోట్లని అంచనా. రష్యా, కజకిస్తాన్‌ల తరువాత భారత్‌కు యురేనియం సరఫరా చేస్తున్న మూడో దేశం కెనడానే. తాము సరఫరా చేస్తున్న యురేనియంను దుర్వినియోగం చేస్తున్నారంటూ 1970లలో కెనడా భారత్‌కు యురేనియం సరఫరాను నిలిపేసింది.2013లో ఇరుదేశాల మధ్య కుదిరిన ‘అణుఇంధన సహకార ఒప్పందం’ భారత్‌కు యురేనియం సరఫరా చేసేందుకు మరోసారి దారులు వేసింది. కాగా కెనడాకు దేశ వీసా విధానాన్ని సరళతరం చేశామని, ఇకపై పదేళ్ల వీసాకు వారు అర్హులని, ఆ దేశ పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యం కల్పిస్తున్నామని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 13 ఒప్పందాలు కుదిరాయి. అంతరిక్ష సహకారానికి సంబంధించి ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.  గత 42 ఏళ్లలో కెనడాలో పర్యటిస్తున్న తొలి భారత  ప్రధాని మోదీనే కావడం విశేషం.
     
    కెనడా సహజ భాగస్వామి: మోదీ
    పౌర అణు ఇంధన రంగంలో ఇరుదేశాల మధ్య దశాబ్దాల అనంతరం వాణిజ్యపరమైన సహకారం పునఃప్రారంభమైందని మోదీ ప్రకటించారు. కెనడాతో సంబంధాలు ఉన్నత స్థాయికి చేరేందుకు తన పర్యటన వేదికగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని  కెనడా పత్రిక ‘ద గ్లోబ్ అండ్ మెయిల్’లో రాసిన వ్యాసంలో వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement