
ప్రయివేట్ బస్సు బోల్తా, 30 మంది మృతి
భువనేశ్వర్: ఒడిశాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్గూల్ జిల్లా ఆత్మలిక్ వద్ద ఓ ప్రయివేట్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. 15మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు. కాగా 50మంది ప్రయాణికులతో బస్సు భౌద్ జిల్లా నుంచి ఆత్మలిక్కు వెళుతుండగా ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సెల్ఫోన్ లో మాట్లాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అన్గూల్ జిల్లా ఎస్పీ కవిత జలాన్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.