
భువనేశ్వర్: ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని అంగుల్–తాల్చేరు సెక్షన్‌లోని 167/1–2 కిలోమీటరు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి 2.35 గంటలకు గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఫిరోజ్‌పూర్ నుంచి ఖుర్దారోడ్డుకు గోధుమలు రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరిగ్గా వంతెనపై జరిగిన ఈ దుర్ఘటనలో 9 వ్యాగన్లు పలీ్టకొట్టి ఒకదానిపై మరొకటి పేరుకుపోగా, ఇంజిన్ పట్టాలపైనే ఉండటంతో లోకో పైలట్, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఢెంకనాల్–సంబల్‌పూర్ సెక్షన్ మధ్య రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12 రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైల్వే సేవలను పాక్షికంగా రద్దు చేసి, దారి మళ్లించి, నడిపిస్తున్నారు.
చురుగ్గా పునరుద్ధరణ పనులు..
ఖుర్దారోడ్డు డివిజన్ డీఆర్‌ఎమ్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలం సందర్శించింది. దుర్ఘటనకు సంబంధించిన పరిస్థితులు, కారణాలను బృందం పరిశీలిస్తోంది. కుండపోత వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరద నీరు ఉధృతికి వంతెన ఇరువైపుల భాగాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సంబల్‌పూర్ నుంచి క్రేన్‌ని తెప్పించి, వ్యాగన్ల పునరుద్ధరణ చేపడుతున్నారు.
ప్రయాణికులకు ఆహారం సరఫరా..
ఈ ప్రమాదం దృష్ట్యా మధ్యలో నిలిచిపోయిన బికనీర్–పూరీ స్పెషల్ రైలు, దుర్గ్–పూరీ స్పెషల్ రైలులోని ప్రయాణికులకు సంబల్‌పూర్ రైల్వే డివిజన్ కేకులు, బిస్కెట్లు, టీ, తాగునీరు సరఫరా చేసింది. టిట్లాగడ్ రైల్వే స్టేషనులో దుర్గ్–పూరీ స్పెషల్, హతియా–పూరీ స్పెషల్, ఎల్‌టీటీ– పూరీ స్పెషల్ రైలు ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లను కూడా రైల్వే సరఫరా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment