మన లాయర్లలో 30 శాతం నకిలీలే!
భారతదేశంలోని లాయర్లలో 30 శాతం మంది నకిలీ పట్టాలతోనే ప్రాక్టీసు చేసేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయానా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మానన్ కుమార్ మిశ్రా తెలిపారు. బార్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన ఓ మెగా లాయర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుచేసిన లాయర్ల మీద చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉంది. దాంతో ఇలాంటి నకిలీలు అందరినీ ఏరిపారేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మిశ్రా చెప్పారు.
బార్ కౌన్సిల్ అంచనా ప్రకారం 20 శాతం మంది లాయర్లు అసలు ఎలాంటి డిగ్రీలు లేకుండానే ప్రాక్టీసు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కూడా నకిలీ డిగ్రీతో దొరికిపోయిన సంగతి తెలిసిందే. నకిలీ లాయర్లతో పాటు.. న్యాయవాద డిగ్రీ చేసి కూడా ప్రాక్టీసు చేయకుండా మానేసిన వాళ్లు వృత్తిని అవమానించినట్లేనని మిశ్రా చెప్పారు.
ఇక చిన్నచిన్న కారణాలకు కూడా న్యాయవాదులు సమ్మెలు చేయడం, కోర్టులను బహిష్కరించడంపై కూడా మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇలా న్యాయవాదులు తరచు సమ్మెలు, కోర్టు బహిష్కరణలు చేస్తున్నారని ఆయన అన్నారు.