32% భారతీయులు థైరాయిడ్ బాధితులే
న్యూఢిల్లీ: ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ప్రస్తుతం థైరాయిడ్ లోపంతో బాధపడుతున్నారని తాజా సర్వే ఒకటి తెలిపింది. 2014–16 కాలంలో దేశవ్యాప్తంగా 33 లక్షల మందిపై ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నోస్టిక్స్ ఈ సర్వేను నిర్వహించింది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 32 శాతం థైరాయిడ్ లోపంతో బాధపడుతున్నట్లు సదరు సంస్థ సర్వేలో తేల్చింది. థైరాయిడ్ బాధితుల్లో మహిళలే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిపింది. బరువు పెరగడంతో పాటు హార్మోన్ల అసమతౌల్యం వల్ల మహిళల్లో ఈ సమస్య ఎదురవుతున్నట్లు సర్వేలో పాల్గొన్న డాక్టర్ అవినాశ్ పడ్ఖే తెలిపారు.
థైరాయిడ్ లోపంలో మధ్యస్తమైన సబ్ క్లినికల్ థైరాయిడిజమ్ వ్యాధి తూర్పు రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాపిస్తుండగా.. హైపోథైరాయిడిజమ్ ప్రభావం ఉత్తర భారతంలో చాలా ఎక్కువగా ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. థైరాయిడ్ లోపంతో బాధపడుతున్న స్త్రీ, పురుషులిద్దరిలో శారీరక బలహీనతతో పాటు అలసట, బరువు పెరగడం, డిప్రెషన్, అధిక కొలస్ట్రాల్ వంటి లక్షణాలు కనిపించినట్లు అవినాశ్ పేర్కొన్నారు. అయినప్పటికీ పురుషుల కంటే మహిళలు థైరాయిడ్ వ్యాధి బారిన పడే అవకాశాలు 8 రెట్లు అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వ్యాధిని ముందుగా గుర్తించడంతో పాటు సరైన చికిత్స అందించడం ద్వారా థైరాయిడ్ లోపాన్ని అధిగమించవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం సబ్ క్లినికల్ థైరాయిడిజమ్ గుట్టుచప్పుడు కాకుండా భారతీయుల్లో వ్యాపిస్తోందని అవినాశ్ హెచ్చరించారు.