
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గురువారం నాటికి 12,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 414కి చేరింది. గడిచిన 24 గంటల్లో 941 పాజిటివ్ కేసులతో పాటు 37 మరణాలు కూడా సంభవించాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 325 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా (జీరో కరోనా కేసులు) నమోదు కాలేదని ప్రభుత్వ నివేదిక తేలిందన్నారు. అలాగే కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించామని తెలిపారు.
మేక్ ఇన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టి పెడుతున్నట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలంతా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. కరోనా నుంచి 1489 మంది బాధితులు కోలుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,90,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. 17 రాష్ర్టాల్లోని 27 జిల్లాల్లో గత 14 రోజుల నుంచి కరోనా కేసులు కొత్తగా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశాలున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment