భోపాల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు మంచాలు లేక నేలపైనే నిద్రించి అవస్థలు పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని విడిశాలో ఓ ఆరోగ్య కేంద్రం కుటుంబ నియంత్రణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీనికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు కు.ని. ఆపరేషన్లు నిర్వహించింది. కానీ వారికి సరైన వసతులు కల్పించడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైంది. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో కేవలం ముగ్గురికి మాత్రమే బెడ్స్ దొరికాయి. మిగతా 37 మంది కటిక నేలపై పడుకుని ఇబ్బందులు పడ్డారు.
ఈ ఘటనపై జిల్లా ప్రధాన వైద్యాధికారి డా. కేఎస్ అహిర్వార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైందంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆసుపత్రి వైద్యాధికారి డా.నరేశ్ బఘేల్‌ను విధులనుంచి తొలగించారు. కాగా ఇలాంటి ఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదు. గతంలోనూ ఇదే జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం 13 మంది మహిళలను నేలపై పడుకోబెట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment