sterilisation operation
-
ఆపరేషన్లు చేశారు.. మంచాలు లేవన్నారు!
భోపాల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు మంచాలు లేక నేలపైనే నిద్రించి అవస్థలు పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని విడిశాలో ఓ ఆరోగ్య కేంద్రం కుటుంబ నియంత్రణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీనికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు కు.ని. ఆపరేషన్లు నిర్వహించింది. కానీ వారికి సరైన వసతులు కల్పించడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైంది. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో కేవలం ముగ్గురికి మాత్రమే బెడ్స్ దొరికాయి. మిగతా 37 మంది కటిక నేలపై పడుకుని ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై జిల్లా ప్రధాన వైద్యాధికారి డా. కేఎస్ అహిర్వార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైందంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆసుపత్రి వైద్యాధికారి డా.నరేశ్ బఘేల్‌ను విధులనుంచి తొలగించారు. కాగా ఇలాంటి ఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదు. గతంలోనూ ఇదే జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం 13 మంది మహిళలను నేలపై పడుకోబెట్టిన విషయం తెలిసిందే. -
అతను కత్తెర పడితే ఇక అంతే..! ఎవరి మాట వినడు!!
సాక్షి, గుంటూరు: ఆపరేషన్ సమయంలో ఇచ్చిన మత్తు కొద్ది కొద్దిగా వదిలే కొద్దీ నొప్పుల బాధ సూది గుచ్చినట్లు ఉంటుంది. పక్కన బంధువులు ఆత్మీయ స్పర్శ కోసం అర చేయి వెతుకులాడుతుంది. పొత్తిళ్ల బిడ్డ పాల కోసం గుక్క పెట్టినప్పుడు.. నొప్పుల బాధను భరించి.. కాస్త కదులుదామంటే కటిక నేలపై మూటలా పడి ఉన్న శరీరం సహకరించక కళ్లలో నీటి ఊట ధారలవుతోంది. ఇదీ రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న బాలింత దుస్థితి. ఎందుకంటే ఇక్కడ వైద్యుడు అనుమతి లేకుండానే ఆపరేషన్లు చేస్తుంటాడు. ఆస్పత్రిలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉంటే ఈయన రోజుకు 10 నుంచి 30 వరకు ఆపరేషన్లు చేసి బాలింతలను నేలపై పడుకోబెడుతుంటారు. ఇదంతా రోగులపై ప్రేమతోకాదు.. ఆయనకు వచ్చే పారితోషికానికి ఆశపడి. దీనిపై ఉన్నతాధికారులు మందలించినా ఆయన తీరులో మార్పు లేదు. ఈ వైద్యుడు చేసే ఆపరేషన్లతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం కుటుంబ నియంత్రణ( కు.ని) ఆపరేషన్లు మాత్రమే పరిమిత సంఖ్యలో చేయాల్సి ఉండగా జిల్లాలోని ఓ ప్రభుత్వ డాక్టర్ ప్రతి రోజూ 10 నుంచి 30 వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. సుమారు 10 రోజుల క్రితం రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు 30 ఆపరేషన్లు చేశాడు. అక్కడ సరిపడా పడకలు లేకపోవటంతో కటిక నేలపైనే ఆపరేషన్లు చేయించుకున్నవారిని పడుకోబెట్టాడు. ఆపరేషన్ చేసినందుకు తనకు వచ్చే తీసుకుని సదరు వైద్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి తెలిసి అక్కడకు వెళ్లి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ప్రతి రోజూ 5 నుంచి ఆరు వరకు మాత్రమే ఆపరేషన్లు చేయాలని ఆదేశించారు. అయినా సదరు వైద్యుడు మారలేదు. పడకలు ఆరు మాత్రమే జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడకలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. కానీ సదరు డాక్టర్ ప్రతి రోజూ పదికిపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. దీంతో ఆరోగ్య కేంద్రాల్లో పడకలు లేక ఆపరేషన్ చేయించుకున్న వారిని నేలపైనే పడుకోబెడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సదరు వైద్యుడు ఆపరేషన్లు చేయటం, వైద్య సిబ్బంది కూడా చోద్యం చూస్తూ ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కాకుండా ఇతర ఆపరేషన్లు సైతం అనుమతి లేకపోయినా చేసేవారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్న వారు చనిపోవటంతో గుంటూరులో పెద్ద రగడ జరిగింది. గత ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడితో కేసు రాజీ చేయించుకుని బయటపడ్డారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరుతో ఇతర ఆపరేషన్లు కూడా ఆయన చేస్తున్నారనే అనుమానాన్ని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్లకు అనుమతులు లేవు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు నియమాలు పాటించాలి. ఆయా ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులే శిక్షణ తీసుకుని ఆపరేషన్లు చేస్తుంటారు. ఒక వేళ ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరిన వైద్యులు ఉంటే వారికి ఆపరేషన్‌పై పట్టు వచ్చే వరకు సీనియర్ వైద్యులను అక్కడకు వెళళ్లి చేయాలని జిల్లా వైద్యాధికారులు ఉత్తర్వులు ఇస్తుంటారు. డబ్బులు కోసం అత్యాశతో అధిక సంఖ్యలో వైద్య సౌకర్యాలు కల్పించకుండా ఆపరేషన్లు చేస్తున్న సదరు వైద్యుడికి రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ డాక్టర్ తనకు అనుమతి ఇవ్వని ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి ఆపరేషన్లు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఆపరేషన్ చేసి వెళ్ళిపోతే అక్కడ సరిపడా వైద్య సౌకర్యాలు లేక ఆపరేషన్ చేయించుకున్న వారికి ఏదైనా రియాక్షన్స్ వస్తే తమకు ఇబ్బంది కలుగుతుందని ఆయా ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వాపోవుతున్నారు. సాక్షాత్తూ జిల్లా వైద్యాధికారే ఆయన్ని అధిక సంఖ్యలో ఆపరేషన్లు చేయవద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా ఆపరేషన్లు చేయటంపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మో ‘భౌ’బోయ్...
సాక్షి, పలమనేరు : పలమనేరులో కుక్కల బెడద పెద్ద సమస్యగా మారింది. గత ప్రభుత్వం వీధికుక్కల సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కుక్కల సంతతి విపరీతంగా పెరిగింది. వీటిని చంపేందుకు నిబంధనలు ఒప్పుకోనందున ఖచ్చితంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీలకు, మున్సిపాలిటీకి ఈ నిధులు అందక సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గతంలో కొన్ని కుక్కలను పట్టి వాటిని మదనపల్లికి తీసుకుని వెళ్లి స్టెరిలైజేషన్ చేయించి వదిలిపెట్టారు. మిగిలిన కుక్కలను పట్టించుకోలేదు. దీంతో సమస్య మళ్లి మొదటికొచ్చింది. రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్న జనం.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధుల్లో కుక్కల బెడద ఎక్కువయ్యింది. రాత్రిపూట వీధుల్లోకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా జనంపైకి వచ్చి పడుతున్నాయి. పలమనేరు పట్టణంలో గత రెండు సంవత్సరాల్లో కుక్కకాటుకు గురైన కేసులు 500 దాకా ఉన్నాయంటే వీటి బెడద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసులను సైతం ఈ కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకి రాత్రి సమయంలో ఏవైన పనులు ఉంటే వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. బైక్‌పై వెలుతున్న వారికి తప్పడం లేదు.. రాత్రిపూట బైక్‌లపై ప్రయాణిస్తున్న వారిని రోడ్లపై కాచుకున్న కుక్కలు తరముకుంటూ వెళ్లి కాటేస్తున్నాయి. కుక్కలను చూసి వేగం పెంచడంతో బైక్ అదుపుతప్పి గాయపడిన సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్పం రోడ్డులో నక్కపల్లి, కొలమాసనపల్లి, కూర్మాయి, మదనపల్లి రోడ్డులో కల్లుపల్లి, మబ్బువాళ్లపేట, గుడియాత్తం రోడ్డులో డిగ్రీ కళాశాల, టి.వడ్డూరు, కాలువపల్లితో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీలకు విడుదల కాని నిధులు.. ఒక్కో కుక్కకు కు.ని శస్త్రచికిత్స చేయాలంటే రూ.500 దాకా ఖర్చు అవుతుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 20వేల కుక్కలకు రూ.కోటి అవసరముంది. కానీ పంచాయతీలకు కుక్కల స్టెరిలైజేషన్‌కోసం గత మూడు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గత సంవత్సరం ‘మిషన్ రాబిస్’ అనే పథకంలో భాగంగా 600 కుక్కలను మదనపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి తిరిగి పట్టణంలో వదిలిపెట్టారు. ఈ ప్రక్రియ కొన్ని రోజులు కొనసాగి ఆ తర్వాత నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి సదరు ఏజెన్సీకి నిధులు విడుదల కాకపోవడంతో ఈ కార్యక్రమం ఆలస్యమవుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. పశువులనూ వదలడం లేదు.. నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో 152 పశువులు కుక్క కాటుకు గురి కాగా ఇందులో 20 దాకా మృతి చెందాయి. వీటిని సంబందిత మండలాల్లోని వెటర్నరీ ఆస్పత్రులకు తోలుకెలితే అక్కడ వైల్స్ అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటుగానే వీటిని రైతులు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మొత్తం మీద ప్రభుత్వం నుంచి అటు పంచాయతీలకు, ఇటు మున్సిపాలిటీలకు పూర్తి స్థాయిలో నిధులు మంజురైనప్పుడే కుక్కల సమస్య అదపులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఆపరేషన్ చేసినా గర్భం.. లేడీ డాక్టర్‌కు భారీ ఫైన్
ముజఫర్‌నగర్: నిర్లక్ష్యం కారణంగా ఓ వైద్యురాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తాను నిర్వహించిన ఆపరేషన్ విషయంలో ఆశ్రద్ధగా వ్యవహరించడంపట్ల ఓ మహిళ వినియోగదారుల కోర్టు మెట్లెక్కడంతో సమస్యల్లో ఇరుక్కుంది. బాధితురాలికి రూ.1,12,000 ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. తనకు పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ముజఫర్ నగర్ జిల్లాకు చెందిన సునీతా దేవీ అనే మహిళ శస్త్ర చికిత్స చేయించుకుంది. 2013లో ఆమె ఈ ఆపరేషన్ చేయించుకోగా తాజాగా ఆమె గర్భం దాల్చింది. దీంతో వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా తాను మరోసారి తల్లి కావాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కంజ్యూమర్ కోర్టును ఆశ్రయించగా డాక్టర్ మంజు అగర్వాల్ అనే వైద్యురాలికి కోర్టు రూ.లక్షకుపైగా ఫైన్ వేసింది.