పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డు సమీపంలో గుంపులుగా తిరుగుతున్న కుక్కలు
సాక్షి, పలమనేరు : పలమనేరులో కుక్కల బెడద పెద్ద సమస్యగా మారింది. గత ప్రభుత్వం వీధికుక్కల సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కుక్కల సంతతి విపరీతంగా పెరిగింది. వీటిని చంపేందుకు నిబంధనలు ఒప్పుకోనందున ఖచ్చితంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీలకు, మున్సిపాలిటీకి ఈ నిధులు అందక సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గతంలో కొన్ని కుక్కలను పట్టి వాటిని మదనపల్లికి తీసుకుని వెళ్లి స్టెరిలైజేషన్ చేయించి వదిలిపెట్టారు. మిగిలిన కుక్కలను పట్టించుకోలేదు. దీంతో సమస్య మళ్లి మొదటికొచ్చింది.
రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్న జనం..
పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధుల్లో కుక్కల బెడద ఎక్కువయ్యింది. రాత్రిపూట వీధుల్లోకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా జనంపైకి వచ్చి పడుతున్నాయి. పలమనేరు పట్టణంలో గత రెండు సంవత్సరాల్లో కుక్కకాటుకు గురైన కేసులు 500 దాకా ఉన్నాయంటే వీటి బెడద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసులను సైతం ఈ కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకి రాత్రి సమయంలో ఏవైన పనులు ఉంటే వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
బైక్‌పై వెలుతున్న వారికి తప్పడం లేదు..
రాత్రిపూట బైక్‌లపై ప్రయాణిస్తున్న వారిని రోడ్లపై కాచుకున్న కుక్కలు తరముకుంటూ వెళ్లి కాటేస్తున్నాయి. కుక్కలను చూసి వేగం పెంచడంతో బైక్ అదుపుతప్పి గాయపడిన సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్పం రోడ్డులో నక్కపల్లి, కొలమాసనపల్లి, కూర్మాయి, మదనపల్లి రోడ్డులో కల్లుపల్లి, మబ్బువాళ్లపేట, గుడియాత్తం రోడ్డులో డిగ్రీ కళాశాల, టి.వడ్డూరు, కాలువపల్లితో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
పంచాయతీలకు విడుదల కాని నిధులు..
ఒక్కో కుక్కకు కు.ని శస్త్రచికిత్స చేయాలంటే రూ.500 దాకా ఖర్చు అవుతుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 20వేల కుక్కలకు రూ.కోటి అవసరముంది. కానీ పంచాయతీలకు కుక్కల స్టెరిలైజేషన్‌కోసం గత మూడు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గత సంవత్సరం ‘మిషన్ రాబిస్’ అనే పథకంలో భాగంగా 600 కుక్కలను మదనపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి తిరిగి పట్టణంలో వదిలిపెట్టారు. ఈ ప్రక్రియ కొన్ని రోజులు కొనసాగి ఆ తర్వాత నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి సదరు ఏజెన్సీకి నిధులు విడుదల కాకపోవడంతో ఈ కార్యక్రమం ఆలస్యమవుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
పశువులనూ వదలడం లేదు..
నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో 152 పశువులు కుక్క కాటుకు గురి కాగా ఇందులో 20 దాకా మృతి చెందాయి. వీటిని సంబందిత మండలాల్లోని వెటర్నరీ ఆస్పత్రులకు తోలుకెలితే అక్కడ వైల్స్ అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటుగానే వీటిని రైతులు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మొత్తం మీద ప్రభుత్వం నుంచి అటు పంచాయతీలకు, ఇటు మున్సిపాలిటీలకు పూర్తి స్థాయిలో నిధులు మంజురైనప్పుడే కుక్కల సమస్య అదపులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment