న్యూఢిల్లీ: దేశంలో 60 శాతం భూభాగానికి భూకంపం ముప్పు పొంచి ఉందని, కనీసం 38 నగరాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ వంటి మహానగరంలో భూకంపం వస్తే నష్టం అపారంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌ను విలవిల్లాడించిన భూకంప ప్రభావంతో భారత్‌లోనూ ఆగ్రా నుంచి సిలిగురి వరకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. కాగా, హిమాలయ ప్రాంతంలో మరిన్ని భూకంపాలు వ చ్చే ముప్పు పొంచి ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఆసియా, భారత ఉపఖండం ఉన్న భూ పలకల మధ్య తీవ్ర ఒత్తిడి ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. భూకంపాలను తట్టుకునేలా భారత్‌లో భవనాలను నిర్మించాల్సి ఉందని, ఇందుకోసం 1962లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) రూపొందించిన నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్టుతో పాటు గుజరాత్‌లోని భుజ్ పట్టణంలో భారీ భూకంపం తర్వాత కట్టిన అనేక భవనాలు మాత్రం బీఐఎస్ ప్రమాణాలను పాటించాయి.
అయితే భూకంపాలను తట్టుకునే భవన నిర్మాణ ప్రమాణాలపై ఎవరికీ అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. భూకంప ముప్పు పొంచి ఉన్న 38 నగరాల్లో సాధారణ స్థాయి ప్రకంపనలకే భవనాలన్నీ కూలిపోయే అవకాశముందని, ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ఓ నివేదికలో వెల్లడించిందని గుర్తుచేస్తున్నారు. ఢిల్లీతో పాటు శ్రీనగర్, గౌహతి, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలు ప్రమాదం అంచున ఉన్నందున ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జూన్‌లో ‘భూకంప’ ఉపగ్ర హ ప్రయోగం
సునామీ, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించే ఉపగ్రహాన్ని జూన్ 9వ తేదీన ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపం, సునామీ తీవ్రమైనవని, వీటి రాకను ముందుగానే పసిగట్టినట్లయితే ముందస్తు చర్యలు తీసుకునేందుకు, ప్రజలను కాపాడేందుకు వీలవుతుందన్నారు.
అదేవిధంగా భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) ఏర్పాటులో భాగంగా ఇటీవల అంతరిక్షానికి పంపిన నాలుగో ఉపగ్రహం బాగా పనిచేస్తోందని కిరణ్‌కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సేవల కోసం ఏడు ఉపగ్రహాలు అవసరమని, ఇందుకుగాను 5వ ఉపగ్రహాన్ని డిసెంబర్‌లో, 6, 7వ ఉపగ్రహాలను వచ్చే ఏడాది మార్చిలో ప్రయోగిస్తామన్నారు.
దేశంలో 38 నగరాలకు ముప్పు
Published Tue, Apr 28 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement