Telangana News: ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయాలి.. కలెక్టర్‌
Sakshi News home page

ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయాలి.. కలెక్టర్‌

Published Tue, Oct 17 2023 1:06 AM | Last Updated on Tue, Oct 17 2023 10:24 AM

- - Sakshi

ఏఎస్‌ఓలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌

మహబూబ్‌నగర్‌: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వ ఏఎస్‌ఓలకు సూచించారు. సోమవారం 25 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి శిక్షణ నిమిత్తం నాగర్‌కర్నూల్‌ జిల్లాకు వచ్చిన ఏఎస్‌ఓ లతో వీడియో కాన్ఫరెన్స్‌ మందిరంలో కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏఎస్‌ఓలు 5 రోజుల పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని, రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు ఎలా ఉన్నాయో, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వాటన్నిటిని డేటా రూపంలో సేకరించాలని అన్నారు.

ప్రతి గ్రామంలో హరితహారం కింద నర్సరీలను ఏర్పాటు చేశామని, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, డంపింగ్‌ యార్డ్‌ వంటివి ఏర్పాటు చేశామని, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. ముఖ్యంగా తాగునీటి కల్పనకు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతు బీమా పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు.

గ్రామస్థాయిలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వారందరితో అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ నిమిత్తం వచ్చిన ఏఎస్‌ఓలకు ఐదు గ్రూపులుగా విభజించి నాగర్‌కర్నూల్‌, తాడూర్‌, తెలకపల్లి, కల్వకుర్తి నాలుగు మండలాలను కేటాయించి ఒక్కో ఏఎస్‌ఓకు ఒక ఇన్‌చార్జ్‌ అధికారితో పాటు, వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం జరుగుతుందని వివరించారు.

నేటి నుంచి అక్టోబర్‌ 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్ర సచివాలయానికి సంబంధించిన అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంత అధ్యయనంలో పాల్గొన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో డీపీఓ కృష్ణ, మహబూబ్‌నగర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ గోపాల్‌, కలెక్టరేట్‌ ఏఓ శ్రీనివాసులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement