aso
-
ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయాలి.. కలెక్టర్
మహబూబ్నగర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఏఎస్ఓలకు సూచించారు. సోమవారం 25 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి శిక్షణ నిమిత్తం నాగర్కర్నూల్ జిల్లాకు వచ్చిన ఏఎస్ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏఎస్ఓలు 5 రోజుల పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని, రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు ఎలా ఉన్నాయో, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వాటన్నిటిని డేటా రూపంలో సేకరించాలని అన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం కింద నర్సరీలను ఏర్పాటు చేశామని, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, డంపింగ్ యార్డ్ వంటివి ఏర్పాటు చేశామని, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. ముఖ్యంగా తాగునీటి కల్పనకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు. గ్రామస్థాయిలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వారందరితో అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ నిమిత్తం వచ్చిన ఏఎస్ఓలకు ఐదు గ్రూపులుగా విభజించి నాగర్కర్నూల్, తాడూర్, తెలకపల్లి, కల్వకుర్తి నాలుగు మండలాలను కేటాయించి ఒక్కో ఏఎస్ఓకు ఒక ఇన్చార్జ్ అధికారితో పాటు, వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం జరుగుతుందని వివరించారు. నేటి నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్ర సచివాలయానికి సంబంధించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంత అధ్యయనంలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీపీఓ కృష్ణ, మహబూబ్నగర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్ గోపాల్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు ఉన్నారు. -
మహిళా ఉద్యోగినిపై దుర్భాషలాడిన ఏఎస్ఓ అధికారి
సాక్షి, తూర్పుగోదావరి : ఏఎస్ఓ అధికారి మహిళ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించమే గాక తీవ్రంగా దుర్భాషలాడిన ఘటన గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రసన్న కుమారి పౌర సరఫరా శాఖలో మహిళా ఉద్యోగినిగా పనిచేస్తుంది. అదే కార్యాలయంలో పీతల సురేష్ ఏఎస్ఓగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ ప్రసన్నకుమారి పట్ల అనుచిత వాఖ్యలు చేయడమే గాక తీవ్రంగా దుర్భాషలాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రసన్న కుమారి బంధువులు డిఎస్వో చాంబర్లో సురేష్ పై దాడికి యత్నించగా అక్కడే ఉన్న డిఎస్వో ప్రసాదరావు వారికి సర్దిచెప్పి పంపిచేశారు. కాగా, ఈ ఘటనను ఖండించిన మహిళా సంఘాలు సురేష్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి. -
గ్రూప్ 2కు తండ్రీ కొడుకులు సెలక్ట్
ప్రకాశం, త్రిపురాంతకం: తండ్రీ కొడుకులు ఒకేసారి గ్రూప్ 2కు సెలక్టయ్యారు. ఒకరు ముందు, ఆ తర్వాత మరొకరు గ్రూప్–2 పరీక్షలు రాశారు. అయితే ఇద్దరికీ ఒకే సారి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో సంతోషంలో మునిగిపోయారు. కష్టపడితే సాధించలేనిది ఏమిలేదంటున్నారు ఈ తండ్రీ కొడుకులు. త్రిపురాంతకం మండలం దూపాడు పంచాయతీ పరిధిలోని దీవెపల్లి గ్రామానికి చెందిన కటికి సుబ్బారావు కుమారుడు శ్రీనివాసులు ఈ ఘనత సాధించారు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. సుబ్బారావు 1999లో గ్రూప్ 2కు సెలక్ట్ అయ్యారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించడంతో కాలయాపన జరిగింది. ప్రస్తుతం సుబ్బారావు ఏఈఓగా సెలక్ట్ అయ్యారు. ఈయన జెడ్పీ హైస్కూల్ దొనకొండలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇతని కుమారుడు శ్రీనివాసులు 2016 గ్రూప్2 ఫలితాల్లో ఏఎస్ఓ సెక్రెటరియేట్గా ఎంపికయ్యారు. అంతంత మాత్రం వసతులున్న స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య, దూపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. గ్రామస్తులు, పలువురు ప్రముఖులు అభినందించారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకుసాగితే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు శ్రీనివాసులు. -
ఏపీ నుంచి తెలంగాణకు 60 మంది ఏఎస్వోలు!
సాక్షి, హైదరాబాద్: సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్వోల కేటాయింపు అంశాన్ని డీవోపీటీకి అప్పగించాలని నిర్ణయించారు. ఏపీ నుంచి 60 మందికిపైగా ఏఎస్వోలు తెలంగాణకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో శుక్రవారం సచివాలయంలో జరిగే కమలనాథన్ కమిటీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీలో పనిచేస్తున్న 263 మంది తెలంగాణ ఉద్యోగుల అంశంపైనా ఈ భేటీలో చర్చించొచ్చని తెలుస్తోంది. గురువారం స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభజనపై కమలనాథన్ కమిటీ చర్చించింది. -
మమ్మల్ని ఏఎస్ఓలుగానే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ 1999 గ్రూప్2 నియామకాల్లో ఏఎస్ఓలుగా నియమితులై సచివాలయంలో కొనసాగుతున్న తమను యథాతథంగా కొనసాగించాలని అసిస్టెంటు సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్ఓ) ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు తమ సమ్మతి పత్రాలను ఏపీపీఎస్సీకి పంపాలని కోరారు. మంగళవారం సచివాలయంలోని 40 మంది ఎఎస్ఓలు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు ఏఎస్ఓలు తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అమలు నేపథ్యంలో తమ సమ్మతి పత్రాలను ఏపీపీఎస్సీ అడిగిందని వారు వివరించారు. తాము ఎక్కువ మార్కులు కలిగి ఉన్నందున ఎగ్జిక్యూటివ్ లు, ఏఎస్ఓలుగా రెండింటికీ అర్హులమేనని చెప్పారు. కాకపోతే ఏఎస్ఓలుగా 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నందున తమకు ఎక్కువ మార్కులు ఉన్నా కూడా ఇదే పోస్టులో కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమ సమ్మతి పత్రాలను తీసుకోవడం ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో పనిచేస్తున్న 973 మందికి మేలు జరుగుతుంద న్నారు.