ముంబైకర్ల మానవత్వం
ముంబై: మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపించారు నలుగురు ముంబై వాసులు. రోడ్డు ప్రమాదానికి గురై చావుబతుల్లో ఉన్న బంగ్లాదేశ్ యువకుడికి రక్తం ఇచ్చి ప్రాణదానం చేశారు. ఢాకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల మహ్మద్ కమ్రుజమాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించగా, ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు.
అతడిది అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూపు అని తెలియడంతో దాతల కోసం ప్రయత్నించారు. బ్లడ్ బ్యాంకుల్లోనూ ఈ గ్రూపు రక్తం దొరక్కపోవడంతో కమ్రుజమాన్ ప్రాణాలపై అతడి కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. అయితే ఈ బ్లడ్ గ్రూపు కలిగిన వారు 400 మంది కంటే తక్కువ మంది ఉన్నారని, రక్తదాతలు ముంబైలో దొరుకుతారని థింక్ ఫౌండేషన్ ద్వారా తెలుకున్నారు.
కమ్రుజమాన్ సహచరుడు ఎస్ కే తుహినుర్ అలాం ముంబై చేరుకుని రక్తదాతలను సంప్రదించాడు. స్వప్న సావంత్, కృష్ణానంద్ కోరి, మెహుల్ భెలెకర్, ప్రవీణ్ షిండే రక్తదానం చేశారు. దీన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఢాకాకు తీసుకెళ్లారు. ఆపరేషన్ తర్వాత కమ్రుజమాన్ కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారని రక్తదాతలు తెలిపారు.