పట్నా : మానవత్వాన్ని మించిన మతం లేదని నిరూపించాడు బిహార్‌కు చెందిన ఓ ముస్లిం. పసిపాప ప్రాణాలు కాపాడటానికి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను పక్కన పెట్టాడు. ఇంతకీ విషయమేమిటంటే.. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆర్మీ జవానుగా పనిచేసే రమేశ్ సింగ్ భార్య ఆర్తీ కుమారి రెండు రోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనారోగ్యంతో జన్మించిన పాప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అర్జెంటుగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే పాపది అరుదైన ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో తమ వద్ద స్టాక్ లేదంటూ ఆస్పత్రి చేతులెత్తేసింది. దీంతో పాప కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పాప పరిస్థితి గురించి ప్రకటన ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో ప్రకటన చూసిన మహ్మద్ అష్ఫాక్ తనది అదే బ్లడ్ గ్రూప్ కావడంతో రక్తం ఇచ్చేందుకు ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఏదైనా తిన్న తర్వాతే రక్తం ఇవ్వాలంటూ డాక్టర్ సూచించడంతో.. మహ్మద్ అక్కడే భోజనం చేసి కాసేపటి తర్వాత రక్తదానం చేశాడు.
అల్లాయే నాకు ఈ అవకాశం ఇచ్చాడు : మహ్మద్ అష్ఫాక్
‘నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆర్మీ జవాను కూతురు ప్రాణాపాయంలో ఉందని తెలిసినపుడు నాకు చాలా బాధగా అన్పించింది. నా బ్లడ్ గ్రూప్ పాప బ్లడ్ గ్రూప్‌తో సరిపోవడంతో అల్లాయే ఒక నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశం నాకు కల్పించాడని భావించాను. అందుకే పాప ప్రాణాల్ని కాపాడటం కోసం ఒక్కరోజు ఉపవాస దీక్షను విరమించాను. నాకు హిందూ, ముస్లిం అనే తేడాలు ఏమీలేవు. మానవత్వాన్ని మించిన మతం లేదని నేను నమ్ముతానంటున్న’ అష్ఫాక్‌పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment