సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయట పడేందుకు దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న ‘లాక్‌డౌన్’ కారణంగా భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది. భారతీయులు ఒక్క మార్చి నెలలోనే మున్నెన్నడు లేని విధంగా ఉపాధి కోల్పోయారని భారతీయ ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) వెల్లడించడం కూడా దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మార్చి నెలాఖరు నాటికి దేశంలో ఉద్యోగుల శాతం 38. 2 శాతానికి, నిరుద్యోగ సమస్య మున్నెన్నడు లేనివిధంగా 8.7 శాతానికి పడిపోయిందని సీఏంఐఈ వెల్లడించింది. ఏప్రిల్ ఆఖరు నాటికి భారత్‌లోని 50 కోట్ల మంది ప్రజలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా అవుతారని, మరో 50 కోట్ల మంది జేబుల్లో ఆర్థిక నిల్వలు సగానికి పడిపోతాయని ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో సామాజిక, ఆర్థిక సమానత్వంపై సీనియర్ ఫెల్లోషిప్ చేస్తోన్న ఏఈ సురేశ్ అంచనా వేశారు. ప్రపంచంలోని పలు దేశాల తరహాలోనే కరోనా వైరస్ సంక్షోభం బాధితులకు భారత ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా చేయడంతో నేరుగా నగదు చెల్లిస్తోంది. (బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో ఆకస్మిక మృతి )
ఆర్థిక నిపుణుల సూచనల మేరకు దీన్ని అమలు చేస్తున్నారని చెప్పవచ్చు. ‘పేదల కోసం తాత్కాలిక ఆదాయ బదిలీ స్కీమ్’ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించగా, ‘అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయ మద్దతు స్కీమ్’ను స్వరాజ్య పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ ఆర్. జగన్నాథన్ సూచించారు. దేశంలోని అట్టడుగు పేదలకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఆరు నెలలపాటు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి సూచించగా, దేశంలోని 75 శాతం ఇళ్లకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున పంచాలని ప్రధాన మంత్రి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియం పిలుపునిచ్చారు. ఇలా ఆర్థిక నిపుణులు చేసిన సూచనలను అమలు చేయాలంటే బోలడంత డబ్బు అవసరం. అంత డబ్బు భారత్‌కు ఎక్కడి నుంచి వస్తుందన్నదే పెద్ద సమస్య. ( కరోనా : రంగంలోకి దిగిన స్పైడర్ మ్యాన్! )
ఇలాంటి సంక్షోభ పరిస్థిలు వచ్చినప్పుడు ప్రజలు తట్టుకొని నిలబడాలంటే ఆ తరహా ఆర్థిక విధానం భారత్‌కు ఉండడం అవసరం. దేశంలోని ‘భారతీయులందరికీ ఏకరీతి ఆదాయ విధానం’ ఉండాలంటూ ప్రధాన ఆర్థిక సలహాదారు 2017లో సమర్పించిన ఆర్థిక సర్వే నివేదికలో సిఫార్సు చేయడాన్ని, పేద ప్రజలందరికి కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామంటూ 2020 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతటి ఆదాయాన్ని ఎలా సమాకూరుస్తారనే సమస్య ఇక్కడ కూడా రాక తప్పదు. ఏ వర్గాలపై భారం వేస్తారన్నది మరో ప్రశ్న. దేశంలోని శతకోటీశ్వరులపైన ‘సంపద పన్ను’ విధించడం వల్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చవచ్చు. అధికారంలోకి వచ్చాక ఈ పన్నును రద్దు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఆ పన్నును పునరుద్ధరించగలదా? కరోనా సంక్షోభ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందన్నది ప్రస్తుతానికి శేష ప్రశ్నే.
Comments
Please login to add a commentAdd a comment