సాక్షి, న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచంలోని 195 దేశాల్లో 40 శాతం దేశాల్లో, అంటే 75 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయని, అందులో భారత దేశం కూడా ఉంటుందని ‘వెరిక్స్ మ్యాపిల్‌క్రాఫ్ట్’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ అంచనా వేసింది. గతేడాది, అంటే 2019లో హాంగ్ కాంగ్, చిలీ, నైజీరియా, సుడాన్, హైతీ, లెబనాన్ తదితర 47 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొనగా 2020 సంవత్సరానికి ఆ పరిస్థితులు 75 దేశాలకు విస్తరిస్తాయని అంచనా వేసి, ఈ మేరకు వెరిక్స్ మ్యాపిల్‌క్రాఫ్ట్ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.
గతేడాది ఎక్కువ అశాంతి పరిస్థితులు నెలకొన్న హాంగ్ కాంగ్, చిలీ దేశాల్లో ఈ ఏడాది కూడా అశాంతి పరిస్థితులు కొనసాగుతాయని, మరో రెండేళ్ల వరకు ఆ దేశాల్లో పరిస్థితి మెరుగు పడే అవకాశం లేదని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత వెనిజులా, ఇరాన్, లిబియా, గినియా, నైజీరియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, పాలస్తీనా, ఇతియోపియా, బొలీవియా దేశాల్లో అశాంతి పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరపడం వల్లనే అశాంతి పరిస్థితులు ఏర్పడతాయని, ఆయా దేశాల ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాయడమే ప్రజా పోరాటాలకు దారితీస్తుందని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా నైజీరియా, లెబనాన్, బొలీవియా దేశాల్లో తీవ్ర ప్రజాందోళనలకు అవకాశం ఉందని పేర్కొంది.
ఆ తర్వాత 2020 సంవత్సరంలో భారత్ సహా ఇతియోపియా, పాకిస్థాన్, జింబాబ్వే దేశాల్లో అశాంతి పరిస్థితులు పెల్లుబికే అవకాశం ఎక్కువగా ఉందని వెరిక్స్ సంస్థ అంచనా వేసింది. భారత దేశం విషయంలో ఈ అంచనాలు ఇప్పటికే నిజం అవుతున్నట్లు నేడు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టికకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాందోళనలు చూస్తుంటే అర్థం అవుతోంది. అశాంతికి కారణాలను గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రశాంత పరిస్థితిలు త్వరలో ఏర్పడే అవకాశాలు లేవు. సమస్యలను పరిష్కరించడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర పరిస్థితులున్న దేశం ‘యెమన్’ అని వెరిక్స్ సంస్థ గుర్తించగా అది దాదాపు నిజమేనని రుజువైంది. ఇంకా అక్కడ పరిస్థితులు మెరగుపడలేదనడానికి ఆదివారం యెమన్‌లో జరిగిన ద్రోన్ దాడిలో 80 మంది సైనికులు మరణించడం గమనార్హం.
ఆందోళనలకు ఆస్కారం ఉన్న 125 దేశాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన ఈ సంస్థ 75 దేశాల్లో ఏదోస్థాయిలో ప్రజాందోళనలు చెలరేగుతాయని అంచనా వేసింది. రష్యా, సౌదీ అరేబియా, చైనా, టర్కీ, థాయ్‌లాండ్, బ్రెజిల్ దేశాల్లో సైన్యం ఎదురుదాడుల వల్ల ఆందోళన చేసే ప్రజలకు ప్రమాదం ఉందని అంచనా వేసింది. చాలా దేశాల్లో ప్రజాందోళనల వల్ల ప్రభుత్వాలు బలహీనపడే అవకాశం ఉండగా, ప్రపంచంలో ఆందోళనకారులకు అత్యంత ప్రమాదకరమైన దేశం ‘ఉత్తర కొరియా’ అని వెరిక్స్ సంస్థ హెచ్చరించింది.
చదవండి: భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం
Comments
Please login to add a commentAdd a comment