
పెళ్లికి 2.5 లక్షలు, రైతుకు 50 వేలు
నగదు విత్‌డ్రా నిబంధనల్లో సడలింపు
- పెళ్లిళ్లు, పంటల సీజన్ కావడంతో వెసులుబాటు
- నగదు మార్పిడి పరిమితి రూ.2 వేలకు తగ్గింపు
- నాన్ గెజిటెడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10 వేల అడ్వాన్‌స
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నగదు విత్‌డ్రా నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం రోజుకో మార్పు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు, వ్యవసాయ పనుల సీజన్ కావడంతో బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రాలో వారికి సడలింపునిచ్చింది. పెళ్లిళ్ల కోసం రూ.2.5 లక్షల వరకూ, రైతులు రూ. 50 వేల వరకూ నగదును తమ ఖాతాల నుంచి తీసుకోవచ్చని వెల్లడించింది. అదే సమయంలో నగదు మార్పిడి పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2 వేలకు తగ్గించారు. ‘పెళ్లి పనుల కోసం రూ. 2.5 లక్షల వరకూ ఒక కుటుంబం విత్‌డ్రా చేసుకోవచ్చు. పాన్‌కార్డు వివరాలు, వాంగ్మూలం బ్యాంకుకు సమర్పించాలి. ఒక పెళ్లికి ఒక వ్యక్తే విత్ డ్రా చేసుకోవాలి. తండ్రి, తల్లి, వరుడు, వధువుల్లో ఎవరో ఒకరు తమ ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు.
ఖాతాకు తప్పకుండా కేవైసీ(నో యువర్ కస్టమర్) పత్రం ఉండాలి. పెళ్లిళ్ల కోసం విత్‌డ్రా పరిమితి సులభతరం చేయాలని ప్రధాని, ఆర్థిక మంత్రులకు అనేక విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం చెప్పారు. రైతులు తమ ఖాతాల నుంచి నగదు తీసుకునే పరిమితిని రూ. 50 వేలకు పెంచామన్నారు. ‘రైతులు వారానికి రూ. 25 వేల వరకూ తీసుకోవచ్చు. పంట రుణం తీసుకున్న రైతులు, కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు దీన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఆర్టీజీఎస్ లేదా చెక్ ద్వారా ఖాతాలోకి నగదు వస్తే మరో రూ.25 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. రైతు బ్యాంకు ఖాతాకు కేవైసీ పత్రం జత చేసి ఉండాల’న్నారు.
డిసెంబర్ 30 వరకూ ఒక్కసారే నగదు మార్పిడి
రోజుకు రూ. 4,500గా ఉన్న నగదు మార్పిడిని రూ. 2 వేలకే పరిమితం చేశారు. డిసెంబర్ 30 వరకూ కేవలం ఒక్కసారే ఈ అవకాశం వాడుకోవాలంటూ నిబంధన పెట్టారు. ‘ఎక్కువ మందికి నగదు మార్పిడి సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు పరిమితి తగ్గించాం. కొందరు వ్యక్తులే పదే పదే బ్యాంకులకు వస్తున్నారు. అందువల్ల చాలామందికి నగదు మార్పిడి అందుబాటులో లేదు.’ అని దాస్ వెల్లడించారు.
కేంద్ర ఉద్యోగులకు రూ. 10 వేల అడ్వాన్స్
నాన్ గెజిటెడ్(టైప్ సీ) కేంద్ర ఉద్యోగులు ముందస్తు జీతంగా రూ. 10 వేల నగదు తీసుకోవచ్చు. ఆ నగదును నవంబర్ నెల జీతం నుంచి మినహారుుస్తారు. నగదు విత్‌డ్రా కోసం ఉద్యోగులు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
టోల్ మినహారుుంపు 24 వరకు పొడిగింపు
జాతీయ రహదారులపై టోల్ ఫీజు రద్దును ఈనెల 24 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొదట ఈనెల 9 నుంచి 11 వరకు టోల్ ఫీజు రద్దు చేసింది. అనంతరం దానిని 14 వరకు పొడిగించింది. అరుునా చిల్లర సమస్య కొలిక్కిరాకపోవడంతో కేంద్రం మళ్లీ 18 అర్ధరాత్రి వరకు టోల్ రద్దు చేసింది. తాజాగా మళ్లీ ఈనెల 24 అర్ధరాత్రి వరకు టోల్ మినహారుుంపునిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
ప్రధాని సమీక్ష
పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఉన్నత స్థారుు అధికారులతో సమీక్షించారు. బ్యాంకులు, ఏటీఎంల్లో అందుబాటులో ఉన్న నగదుపై ప్రధానికి అధికారులు వివరించారు. పీఎంఓ, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షకు హాజరయ్యారు.
ఆత్మహత్యాయత్నమే: శౌరి
నోట్ల రద్దు నిర్ణయాన్ని విప్లవాత్మక చర్యగా అభివర్ణించడాన్ని వాజ్‌పేయి హయాం మంత్రిఅరుణ్ శౌరీ తప్పుపట్టారు. బావిలో దూకడం, ఆత్మహత్యా ప్రయత్నం కూడా విప్లవాత్మకమేనని ఎద్దేవా చేశారు ‘ఇది నల్లధనంపై కాదు.. భారత్‌లో నోట్ల చలామణీపై దాడి’ అని అన్నారు.