బంద్ ఎఫెక్ట్.. 53 చానళ్ల నిలిపివేత
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడానికి వ్యతిరేకంగా కర్ణాటకలో జరుగుతున్న బంద్ పలు మలుపులు తిరుగుతోంది. మాండ్యా, మైసూరు, బెంగళూరు.. ఇలా ప్రధాన నగరాలలో జనజీవనం స్తంభించింది. బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో 3,800 పెట్రోలు బంకులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూతపడ్డాయి. కేబుల్ ఆపరేటర్లు కూడా బంద్‌కు మద్దతు తెలపడంతో 53 తమిళ చానళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. ప్రజలు కావాలంటే నిరసన తెలియజేవచ్చని, అయితే ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే మాత్రం ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఊరుకోదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరులో అదనపు భద్రత కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్, కేరళల నుంచి కూడా పోలీసు సిబ్బందిని పిలిపించారు.
స్కూళ్లు, కాలేజిలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు.. అన్నీ మూత పడ్డాయి. మందుల దుకాణాలను మాత్రం తెరిచి ఉంచారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులతో పాటు ఆటోలు, క్యాబ్‌లు కూడా తిరగడం లేదు. మెట్రో రైలు ప్రయాణాలపై సైతం బంద్ ప్రభావం కనిపిస్తోంది. మాండ్యా, మైసూరు ప్రాంతాల్లో నిరసనకారులు టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. మాండ్యాలోని కేఆర్ఎస్ డ్యాం వద్ద భద్రతను రెట్టింపు చేశారు. న్యాయవాదులు కూడా మైసూరు టౌన్ హాల్ ఎదుట నిరసన తెలిపారు.