సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత దేశం మున్నెన్నడు లేని విధంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. కోట్లాది మంది ప్రజల జీవితాలకు, వారి జీవనాధారాలకు ముప్పు పొంచి ఉంది’ అంటూ కేంద్ర ప్రభుత్వ మేధావుల సంఘం ‘నీతి ఆయోగ్’ వారం రోజుల క్రితం ఓ నివేదికను విడుదల చేసింది. భారత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నీతి ఆయోగ్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న నీటి సంక్షోభం గురించి అనేక దేశాలు గత కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా, పట్టించుకోని నీతి ఆయోగ్ ఇప్పుడు మొదటి సారిగా తన గళం విప్పింది.
2020 నాటికి దేశంలో పచ్చదనం పరుచుకున్న బెంగళూరు సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు అంతరించి పోతాయని, దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలు నీటి కోసం కటకటలాడుతారని నీతి ఆయోగ్ ఆ నివేదికలో హెచ్చరించింది. కేవలం నీటి కొరత కారణంగా దేశంలో ఏటా రెండు లక్షల మంది ప్రజలు మరణిస్తారని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మరో రెండు, మూడేళ్లలో దేశంలోని 75 శాతం ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీళ్లు అందవని, గ్రామీణ ప్రాంతాల్లో 84 శాతం ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుందని కూడా హెచ్చరించింది. అందుబాటులో ఉండే 70 శాతం నీళ్లు కూడా కలుషతమవుతాయని అంచనా వేసింది. ఇప్పటికే మన భారత స్వచ్ఛమైన నీరు కలిగిన 122 దేశాల్లో 120వ స్థానంలో ఉంది.
నీటి సంక్షోభం కారణంగా ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నలుగుతున్న కావేరీ జలాల వివాదం లాంటి వివాదాలు వివిధ రాష్ట్రాల మధ్య కనీసం ఏడు ఏర్పడతాయని, రాష్ట్రాల మధ్య జల యుద్ధాలే జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నీటి సంక్షోభమే ప్రధాన అంశం కావచ్చని కూడా వారు భావిస్తున్నారు. భారత్‌కు ఇంతటి నీటి సంక్షోభం ఎందుకు వచ్చింది? ఇందుకు కారణాలేమిటీ? గత ప్రభుత్వాలుగానీ, నేటి ప్రభుత్వంగానీ నివారణ చర్యలు తీసుకోలేదా? దేశంలో వ్యవసాయం కోసం 70 శాతం జల వనరులను యధేశ్చగా వినియోగించడం, అందుకోసం లెక్కలేనన్ని డ్యామ్‌లు నిర్మించడం, భూగర్భ జలాలను దుర్వినియోగం చేయడం, నీరు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోక పోవడం, కలుషితమైన నీటిని శుద్ధి చేయడం పట్ల శ్రద్ధ చూపకపోవడం నీటి సంక్షోభానికి ప్రత్యక్ష కారణాలుగా నిపుణులు తెలియజేస్తున్నారు.
చెట్లను నరికివేయడం, పర్యావరణ పరిస్థితులను పట్టించుకోకపోవడం పరోక్ష కారణాలని వారు చెబుతున్నారు. దేశంలో జల వన రుల అభివద్ధి కోసం వేసిన వివిధ కమిటీలు చేసిన సిఫార్సులను ఏ ప్రభుత్వం కూడా అంతగా పట్టించుకోలేదని ఆ కమిటీలకు సారధ్యం వíß ంచిన నిపుణులు మిహిర్ షా తెలిపారు. నిర్మించిన డ్యామ్‌లకన్నా నిర్మాణంలో ఆగిపోయిన డ్యామ్‌ల వల్ల జల వనరులకు ఎక్కువ నష్టం జరుగుతోందని ఆయన చెప్పారు. 2018–2019 ఆర్థిక సంవత్సరం వ్యవసాయ బడ్జెట్‌కన్నా ఏడింతలు ఎక్కువ అంటే, నాలుగు లక్షల కోట్ల రూపాయలను ఇదే ఆర్థిక సంవత్సరంలో డ్యామ్‌ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నారని అన్నారు. నేడు దేశంలో అవసరంకన్నా ఆర్థిక అవినీతి కోసమే ఎక్కువ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆయన విమర్శించారు. అమెరికా, చైనా ప్రజలకన్నా భారతీయులు రెట్టింపు భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నారు. 2030 నాటికి భూగర్భ జలాల లభ్యతకన్నా డిమాండ్ రెట్టింపు ఉంటుందన్నది నిపుణుల అంచనా.
దేశంలోని వివిధ నగరాల్లో రోడ్ల విస్తరణకు, ఇతర అభివద్ధి ప్రాజెక్టుల కోసం కోటానుకోట్ల చెట్లను నరికి వేశారు. ఇటీవలనే ఢిల్లీలో పర్యావరణవేత్తలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం క్వాటర్ల పునర్నిర్మాణం కోసం 14వేల పైచిలుకు చెట్లను నరికివేశారు. దేశంలో చార్ ధామ్‌గా ప్రసిద్ధి చెందిన భద్రీనాథ్, ద్వారక, పూరి, రామేళ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ నిర్మిస్తున్న జాతీయ రహదారి ‘చార్‌ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన’కు 2016లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెల్సిందే. ఈ రోడ్డు నిర్మాణం వల్ల పర్యావరణానికి అంతులోని నష్టం జరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనికోసం అటవి ప్రాంతాల్లో కొన్ని శతకోట్ల చెట్లను నరికి వేయడంతోపాటు కోట్ల టన్నుల శకలాలను తీసుకొచ్చి అడవుల్లో, నదుల్లో పారబోస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment