పేరుకే అభిరాముడు.. మహిళను చూస్తే వదలడు!!
డాక్టర్లు.. లాయర్లు.. కౌన్సిలర్లు.. ప్రతి ఒక్కరూ ఆయన బాధితులే. ఆయన వయసు 53 ఏళ్లు. కానీ ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 300 మందికి తన సెల్ఫోన్ నుంచి అసభ్య ఎస్ఎంఎస్లు పంపాడు. ఎట్టకేలకు పోలీసులు ఆ కొద్దిబుద్ధులున్న పెద్దాయనను అరెస్టు చేశారు. అభిరామ్ అతుల్కర్ అనే ఆ పెద్దమనిషి పై అలీబాగ్ మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడు నెలల క్రితం మొదటిసారి అతడి నుంచి తనకు అసభ్య ఎస్ఎంఎస్ వచ్చిందని, దాని గురించి అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదని అలీబాగ్ మునిసిపల్ ఛైర్మన్ నమితా నాయక్ తెలిపారు.
తర్వాత చాలా ఎక్కువగా దారుణమైన మెసేజిలు వచ్చాయని, ఈ విషయం కొందరు స్నేహితుల వద్ద ప్రస్తావిస్త.. వాళ్లు కూడా అతడి బాధితులమేనని చెప్పారని ఆమె అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థలు, ఆస్పత్రులలో పనిచేసే దాదాపు 300 మంది మహిళలకు అభిరామ్ అతుల్కర్ ఇలా అసభ్య మెసేజిలు పంపేవాడని పోలీసులు చెప్పారు. మరికొందరికి అయితే లేఖలు కూడా రాసేవాడని, కానీ ఎవరూ ఇంతవరకు ఫిర్యాదు చేయలేదని.. చివరకు తానే ధైర్యం చేసి ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుని ఫిర్యాదు చేశానని నమితా నాయక్ చెప్పారు.