
సెంట్రల్ వర్సిటీల్లో 6 వేల పోస్టులు ఖాళీ
► తెలంగాణలో 300 పోస్టులు ఖాళీ
► ఎంపీ మేకపాటి ప్రశ్నకు స్మృతీ ఇరానీ సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ సోమవారం సమాధానం ఇచ్చారు. మొత్తం పోస్టులు 16,600 ఉండగా అందులో ఏకంగా 5,928 ఖాళీగా ఉన్నాయన్నారు.
ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 1277, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 2,173, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,478 పోస్టులున్నాయని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పరిధిలో 680 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇతర ప్రాంతాల్లోని పాత సెంట్రల్ వర్సిటీల్లో 3,943 పోస్టులు, కొత్త వర్సిటీల్లో 1,305 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటి భర్తీ ఆయా వర్సిటీలే చేపట్టాల్సి ఉందని వివరించారు.
గతేడాది ఫిబ్రవరిలో వీసీల సదస్సులో ఈ అంశంపై చర్చించామని తెలిపారు. అలాగే రాష్ట్రపతి అధ్యక్షతన గతేడాది నవంబరులో జరిగిన విజిటర్స్ సదస్సులో కూడా చర్చించామని తెలిపారు. ఇక తెలంగాణలోని మూడు సెంట్రల్ వర్సిటీల్లో 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 77 పోస్టులు, హైదరాబాద్ వర్సిటీలో 164 పోస్టులు, ఇఫ్లూలో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.