
డిన్నర్ ఆలస్యమైందని కాల్చి చంపాడు
ఘజియాబాద్: క్షణికావేశంలో తనతో దాదాపు 35 ఏళ్లకు పైగా కాపురం చేస్తున్న భార్యను ఓ భర్త చంపేశాడు. రాత్రి భోజనం త్వరగా సిద్ధం చేయనందుకు గొడవపెట్టుకొని ఇంట్లో తుపాకీతో తలపై కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కవీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానససరోవర్ పార్క్ కాలనీలో సునయన(55), అశోక్‌కుమార్(60) అనే దంపతులు ఉంటున్నారు. వారికి టింకు (28), రింకు (32)అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరికి ఒక మినీ ట్రక్ ఉంది. అయితే, శనివారం రాత్రి బయటకు వెళ్లి బాగా మద్యం తాగి వచ్చిన అశోక్ కుమార్ ఇంకా వంట సిద్ధం చేయలేదా అని గొడవకు దిగాడు. చేస్తాను అని చెప్తుండగానే ఇప్పటి వరకు ఏం చేశావంటూ అనకూడని మాటలు అంటూ తాగిన మైకంలో పోట్లాటకు దిగాడు. ఈలోగా రింకు అతడి భార్య సోనీ జోక్యం చేసుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మరింత ఆగ్రహంతో అశోక్ కుమార్ తమ ఇంట్లోని తుపాకీతో కాల్పులు జరిపాడు. దాంతో ఓ బుల్లెట్ కాస్త సునయనకు తగలడంతో ఆమె కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణం పోయింది. దారి మధ్యలోనే ప్రాణం పోయిందని వైద్యులు స్పష్టం చేశారు.