ఫిల్మ్‌ఫేర్ అవార్డులు : క్వీన్.. నిజంగానే క్వీన్!
ముంబై: సినీ పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయి పేరున్న అవార్డులు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. దక్షిణ భారతదేశ చిత్రాలకు, బాలీవుడ్ చిత్రాలకు వేర్వేరుగా ప్రకటించే ఈ అవార్డుల్లో.. బాలీవుడ్‌కు సంబంధించి, 2014లో విడుదలైన సినిమాలకు గానూ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ ఘన విజయం సాధించిన 'క్వీన్', 'హైదర్' సినిమాలు సత్తా చాటాయి.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులతో పాటు మొత్తం 6 అవార్డులను సొంతం చేసుకొని, క్వీన్ నిజంగానే క్వీన్‌గా నిలబడింది. ఇక హైదర్ విషయానికి వస్తే.. ఉత్తమ నటుడి విభాగంలో అవార్డుతో పాటు మొత్తం 5 అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా.
ఆమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీల తాజా సంచలనం పీకే.. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సంభాషణల విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకొంది. ఇక గతేడాది విడుదలైన చెప్పుకోదగ్గ సినిమాల్లో మొదటి వరుసలో ఉన్న హైవే సినిమాకు గానూ, ఆలియాభట్, ఉత్తమ నటి (క్రిటిక్స్ క్యాటగిరీ) అవార్డును సొంతం చేసుకున్నారు. అలనాటి మేటి నటి కామిని కౌషల్.. జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
ముంబైలో అంగరంగ వైభవంగా సాగిన 60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వివరాలిలా ఉన్నాయి...
ఉత్తమ చిత్రం : క్వీన్
ఉత్తమ దర్శకుడు : వికాస్ భాల్ (క్వీన్)
ఉత్తమ నటుడు : షాహిద్ కపూర్ (హైదర్)
ఉత్తమ నటి : కంగనా రనౌత్ (క్వీన్)
ఉత్తమ సంగీతం : శంకర్-ఏషాన్-లాయ్ (2 స్టేట్స్)
ఉత్తమ నేపథ్య సంగీతం : అమిత్ త్రివేది (క్వీన్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : బాబీ సింగ్, సిద్ధార్థ్ దివన్ (క్వీన్)
ఉత్తమ ఎడిటింగ్ : అభిజిత్ కొకాటే, అనురాగ్ కష్యప్ (క్వీన్)
ఉత్తమ సంభాషణలు, ఉత్తమ స్క్రీన్‌ప్లే : అభిజిత్ జోషీ, రాజ్‌కుమార్ హిరాణీ (పీకే)
ఉత్తమ కథ : రజత్ కపూర్ (ఆంఖో దేఖీ)