ఓ ఇంటీరియర్ డిజైనింగ్ విద్యార్థిని.. వృద్ధుడైన తన కళాశాల ప్రిన్సిపాల్‌ను వివాహం చేసుకోవడం వివాదాస్పదమైంది.
బెంగళూరు : ఓ ఇంటీరియర్ డిజైనింగ్ విద్యార్థిని.. వృద్ధుడైన తన కళాశాల ప్రిన్సిపాల్‌ను వివాహం చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ వివాహానికి విద్యార్థిని తల్లిదండ్రులు అంగీకరించలేదు. కుమార్తెను పెళ్లి చేసుకున్న ప్రిన్సిపాల్‌పై భౌతిక దాడికి యత్నించారు. ఈ సంఘటన బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే...బెంగళూరుకు చెందిన హసన్ముఖ హెచ్.ప్రజాపతి కుమార్తె కృపా హెచ్.ప్రజాపతి(27) హెణ్ణూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ సెంటర్(ఎన్‌ఐసీసీ)లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్‌ఐసీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకాష్ కుమార్(64)ను ప్రేమించింది. కృపా తల్లిదండ్రులు ఈ ప్రేమను వ్యతిరేకించారు. అయితే వారు నెల క్రితం నగరంలోని రాజరాజేశ్వరి నగర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు.
అప్పటి నుంచి తల్లిదండ్రులతో మాట్లాడటం మానేసిన కృపా.. తన భర్త డాక్టర్ ఆకాష్ కుమార్‌తోనే నివసిస్తోంది. తమ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడానికి వారిద్దరూ శుక్రవారం ఉదయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కృపా తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని ఆకాష్ కుమార్‌పై దాడికి యత్నించారు. అమాయకులైన ఆడపిల్లలకు డబ్బు ఆశ చూపించి వారిని లోబరుచుకొని పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు ఇవ్వడం ఆకాష్‌కు అలవాటేనంటూ మండిపడ్డారు.
దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశంపై కృపా హెచ్.ప్రజాపతి స్పందిస్తూ.. చిన్ననాటి నుంచి ఇంట్లో తనపై వివక్ష చూపుతూనే ఉన్నారన్నారు. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు వేధింపులకు పాల్పడ్డారని, ప్రేమ విషయం చెప్పినప్పటికీ అంగీకరించలేదన్నారు. అందుకే ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. కృపా ఆరోపణలను ఆమె తల్లిదండ్రులు ఖండించారు. తామేనాడూ పిల్లలపఐ వివక్ష చూపలేదన్నారు.