లావాదేవీలకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష
బినామీ వ్యవహారంతో సంబంధమున్న అందరిపై చర్యలు: ఐటీ
♦ ఆస్పత్రులకు వెళ్లి నగదు మార్పిడి చేస్తున్న పోస్టల్ శాఖ
♦ నోట్ల రద్దుపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలి: ఖర్గే
న్యూఢిల్లీ: అక్రమార్కుల భరతం పట్టేందుకు ఐటీ శాఖ ఉచ్చు బిగిస్తోంది. పాతనోట్ల రద్దు అనంతరం ఇతరుల ఖాతాల్లో భారీగా నల్లధనం డిపాజిట్ చేస్తున్న వారిపై బినామీ చట్టం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ మరోసారి కొరడా ఝళిపించనుంది. లెక్క చూపని పాత నోట్లను అక్రమ పద్దతుల్లో మార్చుకునేందుకు ప్రయత్నిస్తే... బినామీ వ్యవహారాల చట్టం కింద పెనాల్టీ, విచారణతోపాటు ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష తప్పదని వెల్లడించింది. తనిఖీలు, నిఘా సమాచారం ద్వారా రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని రద్దైన నోట్ల రూపంలో మార్చుకున్నట్లు ఇప్పటికే గుర్తించామని ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 8 నుంచి దాదాపు రూ. 50 కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. నవంబర్ 8 నుంచి భారీగా నగదు డిపాజిట్ చేస్తున్న అనుమానాస్పద ఖాతాలపై నిఘా పెట్టిన ఐటీ ఇప్పటికే చాలా ఖాతాలు గుర్తించింది. ఆ సొమ్ము అక్రమమని తేలితే బినామీ చట్టం ప్రయోగిస్తామని, స్థిర, చరాస్తులు రెండిటికీ ఈ చట్టం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఆస్తుల స్వాధీనంతో పాటు డిపాజిట్ చేసిన వ్యక్తి, అందుకు అనుమతించిన వారిపై చర్యలు తీసుకునేందుకు బినామీ చట్టం అధికారం కల్పిస్తోంది.
జైలు శిక్షతో పాటు జరిమానా
ఇతరుల ఖాతాలో నల్లధనం డిపాజిట్ చేసేవారిని బెనిఫిషియల్ ఓనర్ అని, నగదు వేసేందుకు అనుమతించిన వ్యక్తిని బినామీదారుగా ఈ చట్టం పేర్కొంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బినామీదారు, బెనిఫిషియల్ ఓనర్, బినామీ వ్యవహారంతో సంబంధమున్న ఇతర వ్యక్తులకు ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు, నగదును స్వాధీనం చేసుకుని 25 శాతం వరకూ జరిమానా విధించవచ్చు. ఇతరుల బ్యాంకు ఖాతాల్ని వాడుకుంటూ నల్లధనాన్ని సక్రమంగా మార్చుకునేవారిపై నిరంతర నిఘా పెట్టాలంటూ ఐటీ శాఖను సీబీడీటీ(ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు) ఇంతక ముందే కోరింది.
నోట్ల రద్దుపై జీఎస్టీ భేటీలో రాష్ట్రాల ఆందోళన
నోట్ల రద్దుతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం పడుతోందని ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సమావేశంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుపడడంతో పాటు, పన్ను ఆదాయం తగ్గిందని బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా పేర్కొన్నారు. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయంటూ యూపీ మంత్రి వెల్లడించగా, ఆదాయాలు కోల్పోతున్నామనే ఆందోళనలో చాలా రాష్ట్రాలు ఉన్నాయని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ చెప్పారు. ఆదాయాలు పడిపోయాయని, ఉపాధి రంగం దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమైనా... నిర్ణయం వెనక్కి తీసుకోమని మాత్రం ఏ రాష్ట్రం కోరలేదని తెలిసింది.
ఆస్పత్రులకే పోస్టల్ సిబ్బంది
నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న రోగుల కోసం ఆస్పత్రులకే వెళ్లి నగదు మార్పిడిని పోస్టల్ శాఖ ప్రారంభించింది. ఇంతవరకూ రూ. 25 లక్షల నగదు మార్చినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందు కోసం అనేక బృందాల్ని ఏర్పాటు చేశామని చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్(ఢిల్లీ సర్కిల్) ఎల్‌ఎన్ శర్మ చెప్పారు. డిసెంబర్ 30 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
రూల్ 56 మేరకు చర్చించాలి: ఖర్గే
నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎలాంటి సన్నాహాలు లేకుండా హడావుడిగా తీసుకున్నారని, దీనిపై ఓటింగ్‌కు అవకాశముండే నిబంధనల మేరకు పార్లమెంట్‌లో పూర్తి స్థాయి చర్చ జరగాలని ప్రతిపక్షం కోరుతుందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ రూల్. 56 కింద చర్చ కోరుతుండగా... ప్రభుత్వం మాత్రం ఓటింగ్‌కు అవకాశం లేని రూల్ 193 కింద చర్చ జరగాలని కోరుతుందన్నారు.