
వరుడికి 75 పైసల జరిమానా
హర్యానాలోని ఫతెహబాద్ జిల్లాకు చెందిన మాన్సీకి, పంజాబ్‌కు చెందిన సంజీవ్ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది.
హర్యానాలోని ఫతెహబాద్ జిల్లాకు చెందిన మాన్సీకి, పంజాబ్‌కు చెందిన సంజీవ్ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 22న పెళ్లి. అమ్మాయి ఇంట్లో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. శుభలేఖలు ఇవ్వడం కూడా పూర్తయింది. అయితే ఈ లోపు మగ పెళ్లివారు ‘కట్నాల జాబితా’లోకి మరిన్ని కొత్త వస్తువులను చేర్చడం ప్రారంభించారు. అందులో కారులాంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. ‘‘ఇది అన్యాయం’’ అంటూ ఆడపిల్ల తరపు వాళ్లు ఒంటికాలి మీద లేచారు.
‘‘మా డిమాండ్లు ఒప్పుకోకపోతే పెళ్లి క్యాన్సిల్’’ అని వరుడి నాన్న హెచ్చరిక జారీ చేశాడు. అటూ ఇటూ తిరిగి పంచాయితీ కులపెద్దల వరకు వెళ్లింది. పెళ్లికి తొమ్మిది రోజుల ముందు ‘పెళ్లి క్యాన్సిల్’ అన్నందుకు అగ్గి మీద గుగ్గిలం అవుతూ సదరు పెద్దలు వరుడికి జరిమానా విధించారు. ఆ జరిమానా ఎంతో తెలుసుకుంటే మీరు కూడా ఆ పెద్దల చిన్న బుద్ధుల మీద అగ్గి మీద గుగ్గిలం అవుతారు. ఇంతకీ ఆ జరిమానా ఎంతో తెలుసా... అక్షరాలా డెబ్బై ఐదు పైసలు!!