రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాత ఢిల్లీ-ఫైజాబాద్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం అర్థరాత్రి తర్వాత ఉత్తరప్రదేశ్లోని హపూర్ అనే గ్రామం వద్ద పట్టాలు తప్పింది. మొత్తం ఎన్నిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారని రైల్వే అధికారులు చెబుతుండగా 40 నుంచి 50మంది గాయపడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. సరిగ్గా గర్ముక్తేశ్వర్, కాకాఖేర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే గార్డు తెలిపారు.
ఈ ప్రమాదం జరిగినప్పుడు రైలు వేగం గంటకు 80 కి.మీలుగా ఉందని, పట్టాలు తప్పిన బోగీలు అపాయకర స్థితిలో ఓ పక్కకు పూర్తిగా పడిపోయాయని చెప్పారు. పట్టాలు తప్పిన బోగీల్లో నాలుగు ఏసీ, రెండు స్లీపర్, ఒక జనరల్ బోగీ, మరొకటి సామాన్లు భద్రపరిచే బోగీ పట్టాలు తప్పినట్లు వెల్లడించారు. ఘటనకు కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.