
ఎనిమిది క్వింటాళ్ల కల్తీ స్వీట్స్ సీజ్
లక్నో: దీపావళి పండుగకు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం సాధారణం. అయితే పండుగ సందర్భంగా వ్యాపారులు కక్కుర్తికి పాల్పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో చెడిపోయిన, అపరిశుభ్రమైన మిఠాయిలను పోలీసులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. చాత్ వాలా నగరంలో స్వీట్స్ షాపులలో అమ్మాకానికి వుంచిన దాదాపు ఎనిమిది క్వింటాళ్ల కల్తీ తెల్ల రసగుల్లా స్వీట్స్ ను పోలీసులు సీజ్ చేశారు.
పండుగ రోజున ఇంత భారీ మొత్తంలో కల్తీ స్వీట్స్ మార్కెట్లో లభ్యమవడం స్థానికంగా భయాందోళనలు రేపింది. దీపావళి పర్వదినం సందర్భంగా తాము నిర్వహించిన తనిఖీల్లో రెండు దుకాణాల్లో కల్తీ తెల్ల రసగుల్లాలను గుర్తించినట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి రాజేందర్ సింగ్ తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం, శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు చెప్పారు. అలాగే భారీ ఎత్తున్న స్వాధీనం చేసుకున్న స్వీట్స్‌ను అక్కడ నుంచి తరలించి వాటిని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. నివేదిక అనంతరం ఆయా దుకాణాల యజమానులపై చర్య తీసుకుంటామన్నారు.