
యూనిఫాంలో దాగున్న పాము కాటేసి..
స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని.. స్కూలుకు వెళ్దామనుకుంది. ఎంచక్కా తనకు తానే స్కూలు యూనిఫాం తీసుకుని వేసుకుంది. కానీ కాసేపటికే ఎందుకో బాగా నొప్పిగా అనిపించింది. అంతలోనే నురగలు కక్కుతూ పడిపోయింది. గుజరాత్‌లో ఎనిమిదేళ్ల బాలిక.. స్కూలు యూనిఫాంలో దాగున్న పాము కాటేయడంతో మరణించింది. ఈ ఘటన పంచమల్ జిల్లా పరిధిలోని రింగానియా గ్రామంలో జరిగింది.
అర్మితా బింఝ్వర్ అనే ఆ అమ్మాయి యూనిఫాం వేసుకున్న కొద్ది సేపటికే తనకు నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి.. స్పృహతప్పి పడిపోయింది. దాంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు వెంటనే వెతగ్గా, కూతురి శరీరం మీద పాము కాటేసిన గుర్తు కనిపించింది. అమ్మాయి యూనిఫాంలో దాగున్న పాము.. ఆమె ఆ యూనిఫాం వేసుకోగానే కాటేసినట్లు వారికి అర్థమైంది. వాళ్లు వెంటనే అర్మితను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చినా.. ఒక గంటలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు.