
కంటోన్మెంట్ దారుల మూసివేతను వాయిదా వేయండి
కేంద్ర రక్షణ మంత్రి పారికర్‌కు కార్మిక మంత్రి దత్తాత్రేయ వినతి
సాక్షి, న్యూఢిల్లీ : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తో అనుసంధానమై ఉన్న 9 రహదారులను మూసివేయాలని ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయకుండా.. తాత్కాలికంగా వాయిదా వేయాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. మంగళవారం ఆయన రక్షణ మంత్రిని కలిశారు. కంటోన్మెంట్ రహదారులను మూసివేస్తే ఈ ప్రాంతంలో నివసిస్తున్న 16 లక్షల మంది ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని ప్రత్యామ్నాయ మార్గాలు వెతికేవరకు యథాతథ స్థితిని అమలు చేయాలని కోరారు.
ఇదే విషయమై టీఆర్‌ఎస్ ఎంపీలు బి.వినోద్, బీబీ పాటిల్, టీడీపీ ఎంపీ సీహెచ్. మల్లారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మంత్రి పారికర్‌ను కలిశారు. సమస్యను వివరించారు. ప్రత్యామ్నాయంగా రోడ్లను నిర్మించేవరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. దీనికి మంత్రి స్పందించి డిసెంబర్ 31 లోపే ఈ మేరకు రక్షణ శాఖ నుంచి ఉత్తర్వులు వస్తాయన్నారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు.