న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఆర్థిక సలహా సంఘాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం నియమించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మోదీ ఏర్పాటు చేసిన తొలి ఆర్థిక సలహా సంఘం ఇదే.
ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మూడేళ్ల కనిష్టానికి పడిపోయి, విమర్శలు పెరిగిన నేపథ్యంలో సలహా సంఘాన్ని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కౌన్సిల్‌లో మిగతా సభ్యులుగా నీతి ఆయోగ్ ప్రధాన సలహాదారు రతన్ వాటల్, ఆర్థిక వేత్తలు సుర్జీత్ భల్లా, రథిన్ రాయ్, ఆషిమా గోయల్ ఉంటారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలను విశ్లేషించి ప్రధానికి తెలియజేయటం, ఆయనకు సలహాలు ఇవ్వటం వీరి విధి.