సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక మంత్రిగా సరిలేరు నాకెవ్వరూ అనుకుంటూ అరుణ్ జైట్లీ కూనిరాగం తీస్తుండగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక అంశాల్లో తనకు సలహా ఇవ్వడానికి అనూహ్యంగా ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాగానే 2014లో మోదీ ప్రభుత్వం, అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక సలహా మండలిని రద్దు చేసింది. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను తొలగించారు. ఆ తర్వాత తన ప్రభుత్వమే ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ చీఫ్ అర్వింద్ పనగారియాలను కూడా తొలగించారు.
దేశంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో జాతీయ స్థూల ఆదాయం బాగా పడిపోయిన పరిస్థితుల్లో తన ఆచితూచి ఆర్థిక సలహాలు ఇవ్వడానికి ఈ ఆర్థిక మండలిని ప్రధాని మోదీ మళ్లీ ఏర్పాటు చేశారన్న విషయం చెప్పకనే అర్థం అవుతుంది. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్‌రాయ్ నాయకత్వాన ఏర్పాటు చేసిన ఈ ఆర్థిక మండలిలో ఆర్థిక వేత్తలు సుర్జీత్ భల్లా, రతిన్ రాయ్, ఆషిమా గోయెల్, మాజీ ఆర్థిక కార్యదర్శి రతన్ వతాల్‌ను తీసుకున్నారు.
గతేడాది దేశంలో 500, 1000 రూపాలయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సరైన అంచనా, ముందస్తు ఏర్పాటు లేకపోవడం వల్ల ఆయన తీసుకున్న నిర్ణయం ఫలించలేదు. అలాగే ముందస్తు ఏర్పాట్లు లేకుండానే జీఎస్టీని తీసుకొచ్చారని ఆర్థిక నిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో, అంతర్జాతీయ మార్కెట్‌లో రోజు రోజుకు చమురు ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా పెరగాలి. కానీ గత మూడేళ్లుగా ఉత్పత్తి పరిస్థితి మెరగు పడడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే తనకు తగిన సలహాలు ఇవ్వడం కోసం ఆయన ఆర్థిక సలహా మండలిని తీసుకొచ్చారు.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అంశాల్లో ఆయనకు ఆర్థిక నిపుణులు సరైన సలహాలు ఇవ్వక పోవడం వల్లన ఆయన పొరపాటు నిర్ణయం తీసుకున్నారని భావించలేం. ఎవ్వరి సలహాలు ఆయన వినేరకం కాదని పార్టీ వర్గాలే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆర్థిక మండలిని ఆయన ఏర్పాటు చేసినంత మాత్రాన, దాని సలహాలను ఆయన వింటారా? అన్న గ్యారంటీ లేదు.