న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది కూడా భారత్‌లో సాధారణ వర్షపాతమే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. 97 శాతం సాధారణ వర్షపాతాన్ని అంచనావేస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ పేర్కొన్నారు. అసలు ఈ ఏడాది తక్కువ వర్షపాతాల సూచనే లేదని తెలిపారు. నేడు నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో 2018 సంవత్సరానికి సంబంధించిన తొలి వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. గత రెండేళ్లలో భారత్‌లో మంచి వర్షాలు పడ్డాయని, మంచి పంటలు కూడా పండాయని, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా వర్షాలు ఉండనున్నాయని రమేష్ చెప్పారు.
మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేరళకు రుతుపవనాలు వస్తాయని, 45 రోజుల్లో అవి దేశమంతటా విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఈసారి బలహీన లానినో ఉందని, ఇది కూడా న్యూట్రల్ కావొచ్చన్నారు. ఎల్‌నినోకు పూర్తిగా వ్యతిరేక లక్షణాలను లానినో కలిగి ఉంటుంది. సాధారణ వర్షపాతం కేవలం వ్యవసాయ వృద్ధిని పెంచడమే కాకుండా.. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపనుందని ఐఎండీ తెలిపింది. ఇది బీజేపీ ప్రభుత్వానికి ఎంతో కీలకమని పలువురంటున్నారు. 2019లో సాధారణ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రభుత్వానికి ఐఎండీ గుడ్‌న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే 96 శాతం నుంచి 104 శాతం మధ్య వర్షపాతం నమోదైతే దాన్ని సాధారణం వర్షపాతంగా పేర్కొంటారు. 104 శాతం కన్నా ఎక్కువ పడితే అధిక వర్షపాతం అని, 96 శాతం కన్నా తక్కువ పడితే లోటు వర్షపాతంగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment