‘ఎబోలా’ భయంతో స్వదేశానికి 98 మంది భారతీయులు
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో అక్కడకు వలసవెళ్లిన భారతీయులు ప్రాణభయంతో స్వదేశానికి చేరుకుంటున్నారు. లైబీరియా, నైజీరియాల నుంచి మంగళవారం ఉదయం మొత్తం 98 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. లైబీరియా నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన 13 మంది భారతీయులతోపాటు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు విడతలుగా వచ్చిన 85 మంది భారతీయులను పరీక్షించి వారిలో వైరస్ లక్షణాలు లేవని నిర్ధరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. లైబీరియా నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల్లో ఆఫ్కాన్స్ అనే కంపెనీలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 112 మంది ఉన్నారు. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.
ఎబోలా నివారణ తేలికే: యూఎస్ ఎయిడ్
మలేరియాతో పోలిస్తే ఎబోలా వైరస్ బారినపడకుండా తప్పించుకోవడమే తేలికని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఎయిడ్) డెరైక్టర్ జెర్మీ కోన్యన్‌డిక్ పేర్కొన్నారు. ఎబోలా సోకిన వ్యక్తి శరీర ద్రవాలను తాకకుండా ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చన్నారు. 1976 నుంచి ఇప్పటివరకూ ఎబోలా మృతుల సంఖ్య 3 వేల లోపు ఉండగా మలేరియా వల్ల ప్రతి రెండు రోజులకు 3 వేల మంది మరణిస్తున్నారనే అంచనాలు ఉన్నాయన్నారు.