పాక్ నుంచి భారత్‌కు 98 వేల కోట్లు
అక్కడి ఎన్నారైలు పంపిన సొమ్ము
న్యూఢిల్లీ: వివిధ దేశాలనుంచి భారత్‌లోని బ్యాంకులకు నగదు బదిలీ చేస్తున్న దేశాల్లో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉందని ప్రపంచబ్యాంకు ఒక నివేదికలో వెల్లడించింది. గత మూడేళ్లలో పాక్‌లోని భారతీయులు స్వదేశానికి రూ.98,796 కోట్లు పంపినట్లు పేర్కొంది. అయితే ఇది అంచనా మాత్రమేనని తెలిపింది. పాక్ నుంచి భారత్‌కు నగదు బదిలీ విషయంలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉండటంతో పాటు పాక్‌లో పెద్దగా భారతీయులు నివసించనప్పటికీ ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలను ప్రపంచబ్యాంకు వెల్లడించడం గమనార్హం.
ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన మైగ్రేషన్ అండ్ రెమిటెన్స్ ఫ్యాక్ట్ బుక్ 2016 ప్రకారం 2015లో ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో స్థిరపడిన ప్రజలు మాతృ దేశానికి పంపిన నగదు విషయంలో రూ.4 లక్షల 95 వేల కోట్లతో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. చైనా రూ.4 లక్షల 40 వేల కోట్లు, ఫిలిప్పీన్స్ రూ. 2 లక్షల 6 వేల కోట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్‌లోని ప్రవాస భారతీయులు 2015లో రూ.33,711 కోట్లు, 2014లో రూ.32,955 కోట్లు, 2013లో రూ.32,129 కోట్లు భారత్‌కు పంపినట్లు ప్రపంచబ్యాంక్ పేర్కొంది. దీనిపై ప్రపంచబ్యాంకు వలసలు, చెల్లింపుల విభాగం మేనేజర్ దిలీప్ రాథ్ మాట్లాడుతూ ఇది క చ్చితమైన నివేదిక కాదని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక చెల్లింపులకు సంబంధించి అంచనా మాత్రమేనని వివరించారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2015లో యూఏఈలో నివసిస్తున్న భారతీయులు అత్యధికంగా రూ. 90 వేల కోట్లు మాతృదేశానికి పంపించారు. అమెరికానుంచి రూ. 79 వేల కోట్లు, సౌదీ అరేబియా నుంచి రూ. 75 వేల కోట్లు పంపించారు.