నేలను నమ్మినోడు.. నీళ్లను చోరీ చేశాడట!
లక్నో: కరువు ఉదంతాల్లో ఇదీ ఒకటి. నేలను నమ్ముకున్న రైతు చివరికి నీళ్ల దొంగతనం కేసులో కటకటాలపాలయ్యాడు. రైతుల ఆశ, అధికారుల అత్యుత్సాహాలకు అద్దంపట్టే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ బుందేల్ ఖండ్ లోని మహోబా జిల్లా చోటుచేసుకుంది. గడిచిన మూడేళ్లుగా బుందేల్ ఖండ్ ను కరువు రక్కసి కాటేస్తూనేఉంది. ఇప్పుడు అరెస్టయిన హిరాలాల్ యాదవ్ లాంటి పేద రైతులు చాలామంది కొండంత అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హీరాలాల్ ప్రకృతితోపోటీపడి విత్తనాలు నాటాడు. మొక్క మొలిచింది. దానికి నీళ్లుకావాలి. ఊరికి దగ్గరలోనే ఉర్మిల్ డ్యామ్ ఉంది. ఇక అసలు కథ మొదలైంది..
ఉర్మిల్ డ్యామ్ వాల్వ్ లను ధ్వంసంచేసి హీరాలాల్ తన పొలానికి నీళ్లు మళ్లించుకుని వెళ్లాడని డ్యామ్ ఇంజనీర్లు కేసు పెట్టారు. వాల్వ్ ను ధ్వంసం చేసిన ప్రదేశంలో ఒక నీటి గుంటను తవ్వి.. అక్కడి నుంచి తన పొలానికి నీళ్లు పారించుకుంటున్నాడని అధికారులు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆస్ధిని ధ్వసం చేసి నందుకుగానూ అతనిపై సెక్షన్ 430, 353ల కింద కేసులు నమోదయ్యాయి.
అయితే, మట్టిని నమ్ముకున్న తనకు నీళ్లను చోరీచేయాల్సిన అవసరం లేదని హీరాలాల్ వాదిస్తున్నాడు. వృథాగా పోతున్న నీటినే మళ్లించుకున్నానని చెబుతున్నాడు. డ్యామ్ వాల్వ్ ఇంతకు ముందే చెడిపోయిందని, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకే అధికారులు తన భర్తపై తప్పుడుకేసు బనాయించారని హీరాలాల్ భార్య మున్నీదేవీ చెబుతున్నారు. జూన్ వరకు ఉర్మిల్ డ్యామ్ లోని నీటిని కేవలం తాగు అవసరాలకే వినియోగించాలనే నిబంధన ఉంది.