పండుగనాడు పెను విషాదం
బిహార్‌లో గంగా నదిలో పడవ మునిగి 24 మంది మృతి
- పతంగుల ఉత్సవం తిలకించి పట్నాకు వస్తుండగా దుర్ఘటన
- సామర్థ్యానికి మించి ప్రయాణికుల వల్లే ప్రమాదం
పట్నా: సంక్రాంతి పర్వదినం రోజున శనివారం బిహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంగా నదీ తీరంలో పతంగుల ఉత్సవం తిలకించి పట్నాకు తిరిగి వస్తుండగా పడవ మునిగి 24 మంది మంది జలసమాధి అయ్యారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే పడవ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఉత్సవ నిర్వాహకులు, పడవ నడుపుతున్న వారిపై కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ రూ. 2 లక్షలు, రూ. 4 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. అలాగే ప్రమాదంపై నితీశ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
మకర సంక్రాంతి సందర్భంగా పట్నాకు ఆవల గంగా నదీ తీరం వెంట ఉన్న పర్యాటక ప్రాంతం సబల్‌పుర్ డయారాలో పతంగుల ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. శనివారం ఈ పోటీల్ని తిలకించాక 40 మంది ప్రయాణికులతో పడవ పట్నాలోని రాణిఘాట్‌కు బయలుదేరింది. పరిమితికి మించి జనం ఎక్కడంతో పడవ అదుపు తప్పి మునిగిపోయింది. తీరం చేరకుండానే 24 మంది ప్రయాణం మధ్యలోనే ముగిసిపోవడం అందరినీ కలిచివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే శనివారమే 20 మృతదేహాల్ని వెలికితీశామని, ఆదివారం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయని బిహార్ ముఖ్య కార్యదర్శి(విపత్తు నిర్వహణ) ప్రత్యాయ అమ్రిత్ తెలిపారు.
ఈ విషాదం నేపథ్యంలో ఆదివారం పట్నాలోని మహాత్మా గాంధీ సేతు పునరాభివృద్ధి పనుల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడాల్సి ఉండగా వాయిదా వేశారు. మరో 3 రోజుల పాటు జరగాల్సిన పతంగుల పండుగను కూడా రద్దు చేశారు. సబల్‌పుర్ డయారాలో వినోదపు పార్కు నిర్వాహకులు, శరణ్, పట్నా జిల్లాల మధ్య అక్రమంగా పడవలు నడుపుతున్న వారిపై సోనేపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ప్రభుత్వానిదే బాధ్యత
పతంగుల పండుగ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపమే ప్రమాదానికి కారణాలంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ తప్పుపట్టారు. పతంగుల ఉత్సవానికి వెళ్లేందుకు సరిపడా పడవల్ని ఏర్పాటు చేయలేదన్నారు.