స్కానింగ్ రిపోర్టు చూసి కంగుతిన్న డాక్టర్లు
న్యూఢిల్లీ: యోగాతో ఏదైనా సాధ్యమని, ఏం తిన్నా కడుపులో ఎంచక్కా జీర్ణమవుతాయని భావించాడు. గతంలో కొన్ని రోజులపాటు ఇనుప ముక్కలు తిన్నాడు. బ్లేడ్లు, ట్యూబ్‌లైట్లను సైతం బొజ్జలో వేసుకున్నాడు. చివరికి తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. కొన్ని రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత వైద్యులు అతడికి పునర్జన్మ ప్రసాదించారు. ఆ వివరాలు.. స్థానిక అశోక్ విహార్‌కు చెందిన శైలేంద్ర సింద్ర(52)కు కొంతకాలం కింద తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.
ఆయన బాడీని స్కాన్ చేసిన వైద్యులు అప్పట్లో కంగుతిన్నారు. యోగాతో ఏదైనా కరిగించవచ్చని భావించి ఇనుము వస్తువులు, బ్లేడ్లు, ట్యూబ్‌లైట్ అద్దాలు లాంటి పదార్థాలు తిన్నానని డాక్టర్లకు చెప్పాడు. వారి స్కానింగ్‌లో అది నిజమని తేలింది. దీంతో కొన్ని రోజులపాటు వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆయనకు యాంటీ సైకోటిక్ థెరపీ చేసి మెడిసిన్ ఇస్తూ రోజు పరీక్షించినట్లు డాక్టర్ ఆర్‌పీ బెనివాల్ తెలిపారు. ఎట్టకేలకు ఆపరేషన్ చేసి రెండు లోహపు ప్లేట్లు, ఆరు సూదులు, కొన్ని బ్లేడ్లు, ట్యూబ్‌లైట్ అద్దాలను బయటకు తీసినట్లు వివరించారు. నాలుగు నెలల తమ శ్రమ ఫలించిందని వైద్యులు చెబుతున్నారు.
శైలేంద్ర ఒంటరిగా ఉంటున్నాడని ఈ క్రమంలో ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాగా కడుపులో లోహాలు, సూదులు, బ్లేడ్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పేసరికి ఆశ్చర్యానికి లోనైనట్లు ఆయన సోదరి ఉమ తెలిపారు. అతడు ఇలా చేస్తుంటాడని ఎప్పుడు సందేహం రాలేదన్నారు. అయితే సోదరుడు శైలేంద్ర.. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు హార్మోనియం వాయిస్తూ తోటి పేషెంట్లకు ఊరట కలిగించేవాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం కుదుట పడుతున్నందుకు ఆమె హర్షం వ్యక్తం చేశారు.
'నేను ఆర్మీలో చేరాలలనుకున్నాను. కానీ నా పేగులలో సమస్య ఉందని, బతకడం కష్టని చెప్పడంతో ఆశను వదులుకున్నాను. ఇప్పటివరకూ నాకేం కాలేదు. యోగాతో ఏదైనా సాధ్యమని విన్నాను. అందుకే దాదాపు తొమ్మిదేళ్ల కిందట లోహాలు, అద్దాలు, బ్లేడ్లు, సూదులు మింగాను. యోగా వల్ల నేటికీ ప్రాణాలతో ఉన్నాను. ఒక్కోక్కరికి ఒకో రకమైన విశిష్టిత ఉంటుందని' పేషెంట్ శైలేంద్ర సింగ్ వివరించాడు.