
అమరీందర్ ప్రమాణం పంజాబ్ కేబినెట్‌లోకి సిద్ధూ
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ 26వ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అమరీందర్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులతో గవర్నర్ వీపీ సింగ్ బద్నూర్ ప్రమాణం చేయించారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూకు ఉపముఖ్యమంత్రి పదవి లభించనుందంటూ వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ.. సిద్దూ కూడా మంత్రిగానే ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు హాజరయ్యారు. గరిష్టంగా 18 మందిని మంత్రులుగా నియమిం చుకునే అవకాశముండగా, ప్రస్తుతం 9 మందినే తీసుకున్నారు. పంజాబ్ సీఎంగా అమరీందర్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. సిద్ధూకు స్థానిక ప్రభుత్వ వ్యవహారాల శాఖతో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖలను అప్పగించారు. మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ మేనల్లుడు మన్‌ప్రీత్ సింగ్‌కు ఆర్థిక శాఖ, సీనియర్ నేత బ్రహ్మ్ మొహీంద్రకు ఆరోగ్య శాఖ కట్టబెట్టారు. హోం, విజిలెన్స్, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలను అమరీందర్ తన వద్దే ఉంచుకున్నారు.