కోరి ‘తెచ్చుకున్న’ కొరివి
(సాక్షి, నేషనల్ డెస్క్): బద్దలయ్యే ముందు అగ్నిపర్వతంలా ఉంది సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి. పార్టీ చీఫ్, తండ్రి ములాయంతోనే నేరుగా ఢీకొనేందుకు సీఎం అఖిలేశ్ సిద్ధమయ్యేలా పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికలముందు పార్టీకి అవసరమని తీసుకొచ్చిన అమర్‌సింగ్ కారణంగానే.. ఎస్పీలో, యాదవ కుటుంబంలో ముసలం పుట్టిందని పార్టీ ముఖ్యనేతలంటున్నారు.
అంతా అమర్‌సింగ్ వల్లే!
పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడైన అమర్‌ను మళ్లీ పార్టీలోకి రావటంతో ఎస్పీలో ముసలం మొదలైంది. అయితే.. యూపీ ఎన్నికల నేపథ్యంలో అమర్ పార్టీలోకి రావటం అవసరమని ములాయంను సొంత సోదరుడు శివ్‌పాల్ ఒప్పించాడు. అమర్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవటం, ఏకంగా రాజ్యసభ సీటివ్వటాన్ని అఖిలేశ్ వర్గం వ్యతిరేకిస్తోంది. అఖిలేశ్‌కు ములాయం చిన్నాన్న కుమారుడు రాంగోపాల్ మద్దతుగా ఉన్నారు.
పై చేయి కోసం.. దీనికి తోడు నెలరోజుల క్రితం వివిధ కారణాలతో శివ్‌పాల్‌ను కేబినెట్ నుంచి అఖిలేశ్ తప్పించటం.. తదనంతర పరిణామాలతో యూపీ పార్టీ చీఫ్‌గా అఖిలేశ్‌ను తప్పించిన ములాయం.. శివ్‌పాల్‌కు బాధ్యతలు అప్పగించటంతో వివాదం మొదలైంది. అఖిలేశ్‌కు అనుకూలంగా ఉన్న కొందరు యువనేతల్నీ ములాయం పార్టీ పదవుల నుంచి తప్పించారు. దీనికితోడు గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ నేతృత్వంలోని ఖ్వామీ ఏక్తా దళ్‌ను ఎస్పీలో విలీనం చేసే ప్రయత్నాన్నీ అఖిలేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణాలన్నీ యాదవ కుటుంబంలో ముసలానికి కారణమయ్యాయి. సయోధ్యకోసం ములాయంతోపాటు.. పార్టీ సీనియర్ నేతలైన బేణీ ప్రసాద్‌వర్మ, మరికొందరు ప్రయత్నించినా ప్రభావం కనిపించలేదు.
చీలిన కుటుంబం.. ఈ నేపథ్యంలోనే.. ఇన్నాళ్లుగా ఒకచోటే కలసి ఉంటున్న యాదవ్ కుటుంబం నుంచి బయటపడ్డ అఖిలేశ్ వేరు కుంపటి పెట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి మకాం మార్చారు. దీనికి అఖిలేశ్ పినతల్లి (ములాయం రెండో భార్య) కారణమంటూ సీఎం వర్గం ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ వ్యాఖ్యానించటం.. ఆయన్ను పార్టీనుంచి ములాయం బహిష్కరించటం చకచకా జరిగిపోయాయి. ఇది జరిగిన రెండ్రోజుల్లోనే అమర్‌సింగ్ అనుకూలురుగా పేరున్న ముగ్గురు మంత్రులను సీఎం తొలగించటం, దేనికైనా సిద్ధమనే ధోరణిలో కనిపించటం సమాజ్‌వాదీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలనిస్తోంది.