CM Akhilesh
-
బలప్రదర్శనకు దిగిన ములాయం.!
-
ఎస్పీ మాదే: అఖిలేశ్ వర్గం
న్యూఢిల్లీ: యూపీలో ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో సీఎం అఖిలేశ్ వర్గం ముందడుగేసింది. అఖిలేశ్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సంతకాలు చేసిన అఫిడవిట్లను రామ్‌గోపాల్ యాదవ్ ఎన్నికల సంఘానికి అందజేశారు. రాంగోపాల్ మాట్లాడుతూ ఎస్పీ లోని 90 శాతం మంది అఖిలేశ్ పక్షాన ఉన్నారు కాబట్టి తమదే అసలైన ఎస్పీ అనీ, ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను తమకే కేటాయించాలని కోరారు. పార్టీకున్న 229 మంది ఎంఎల్ఏల్లో 200 మందికి పైగా, 68 మంది ఎంఎల్సీల్లో 56 మంది, 24 మంది ఎంపీల్లో 15 మంది అఖిలేశ్‌కు మద్దతు తెలుపుతున్నారన్నారు. కాగా, తమ మద్దతుదారుల సంతకాలతో కూడిన అఫిడవిట్లను ములాయం వర్గం సోమవారం ఈసీకి సమర్పించే వీలుంది. -
ఢీ అంటే ‘డీ’
డెవలప్మెంట్ వర్సెస్ డీమానిటైజేషన్‌గా మారిన యూపీ ఎన్నికలు - అభివృద్ధి అస్త్రంతో అఖిలేశ్.. నోట్లరద్దు లాభాలతో మోదీ - రెండునెలలుగా జోరుగా అఖిలేశ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు - అమిత్ షా నేతృత్వంలో ‘కమల్ ఖిలావో’ ప్రచారం దేశంలో జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. అభివృద్ధి మంత్రంతో మళ్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని సీఎం అఖిలేశ్ వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో మోదీ నోట్లరద్దు (డీమానిటైజేషన్), అఖిలేశ్ అభివృద్ధి (డెవలప్మెంట్) మధ్యే యూపీ ఎన్నికల ప్రచారం ప్రస్తుతానికి జోరుగా సాగుతోంది. 2 నెలలుగా అఖిలేశ్ బిజీ.. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా 71 ఎంపీ సీట్లు (యూపీ నుంచి) గెలుచుకున్న బీజేపీని నిలువరించేందుకు అఖిలేశ్ అన్ని మార్గాలను వెతుకుతున్నారు. యాదవ్ కుటుంబంలో గొడవలు, యూపీలో శాంతిభద్రతలపై అసంతృప్తి, సామాన్యులకు రక్షణ కరువైందన్న విమర్శల నేపథ్యంలో.. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే.. నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రచారం చేసుకుంటున్నారు. రెండు నెలలుగా కేవలం గతంలో చేసిన పనులను ప్రారంభించేందుకే సీఎం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. లక్నో మెట్రో రైలు ట్రయల్ రన్ నిర్వహించటంతోపాటు 302 కి.మీ. పొడవైన ఆగ్రా–లక్నో ఎక్స్ప్రెస్వేనూ అఖిలేశ్ ప్రారంభించారు. బీజేపీ జోరును అడ్డుకునేందుకు నోట్లరద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశాన్నీ పదే పదే ప్రస్తావిస్తున్నారు. మోదీపైనే కమలం భరోసా నోట్లరద్దుతో నల్లధనం, అవినీతిని పెకిలించి వేయొచ్చని.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ప్రధాని యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలనూ అడ్డుకోవటం ద్వారా విపక్షాలు.. అవినీతి, నల్లధనానికి మద్దతుగా నిలుస్తున్నాయని ప్రజావేదికలపై చెబుతున్నారు. యూపీలో అధికారంలో ఉన్న ఎస్పీ, అంతకుముందు బీఎస్పీ అవినీతిలో కూరుకుపోయి అభివృద్ధిని మరిచిపోయాయని విమర్శిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారానే విపక్షాలను ఇరకాటంలో పెట్టాలని యూపీ బీజేపీ నేతలకు మోదీ సూచిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ వీలైనన్ని మార్గాలను వెతుకుతోంది. పార్టీ చీఫ్ అమిత్ షా దగ్గరుండి మరీ ‘కమల్ ఖిలావో’(కమల వికాసం) ప్రచారానికి మార్గదర్శనం చేస్తున్నారు. అయితే.. నోట్లరద్దుపై క్షేత్రస్థాయిలో అనుకూలంగా లేదని యూపీ బీజేపీ నేతలంటున్నారు. మోదీ నిర్ణయంపై వ్యతిరేకత లేకపోయినా.. అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల అసంతృప్తి ఉందంటున్నారు. అయితే.. మోదీ ప్రచారం వల్ల రానున్న రోజుల్లో సానుకూల వాతావరణం ఏర్పడొచ్చన్నారు. దీంతోపాటు ఎస్పీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన కార్యక్రమాలన్నీ అసంపూర్తిగా మిగిలాయని, వీటి గురించి ప్రజలకు చెబుతామంటున్నారు. బీఎస్పీ కూడా అఖిలేశ్ ప్రభుత్వం చేసిన అసంపూర్తి పనులపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మోదీపైనా నోట్లరద్దు సమస్యల ప్రభావం తప్పదని బీఎస్పీ చీఫ్ మాయావతి చెబుతున్నారు. అయితే.. ఎన్నికల సంఘం ఒక్కసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారే అవకాశమూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోరి ‘తెచ్చుకున్న’ కొరివి
(సాక్షి, నేషనల్ డెస్క్): బద్దలయ్యే ముందు అగ్నిపర్వతంలా ఉంది సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి. పార్టీ చీఫ్, తండ్రి ములాయంతోనే నేరుగా ఢీకొనేందుకు సీఎం అఖిలేశ్ సిద్ధమయ్యేలా పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికలముందు పార్టీకి అవసరమని తీసుకొచ్చిన అమర్‌సింగ్ కారణంగానే.. ఎస్పీలో, యాదవ కుటుంబంలో ముసలం పుట్టిందని పార్టీ ముఖ్యనేతలంటున్నారు. అంతా అమర్‌సింగ్ వల్లే! పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడైన అమర్‌ను మళ్లీ పార్టీలోకి రావటంతో ఎస్పీలో ముసలం మొదలైంది. అయితే.. యూపీ ఎన్నికల నేపథ్యంలో అమర్ పార్టీలోకి రావటం అవసరమని ములాయంను సొంత సోదరుడు శివ్‌పాల్ ఒప్పించాడు. అమర్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవటం, ఏకంగా రాజ్యసభ సీటివ్వటాన్ని అఖిలేశ్ వర్గం వ్యతిరేకిస్తోంది. అఖిలేశ్‌కు ములాయం చిన్నాన్న కుమారుడు రాంగోపాల్ మద్దతుగా ఉన్నారు. పై చేయి కోసం.. దీనికి తోడు నెలరోజుల క్రితం వివిధ కారణాలతో శివ్‌పాల్‌ను కేబినెట్ నుంచి అఖిలేశ్ తప్పించటం.. తదనంతర పరిణామాలతో యూపీ పార్టీ చీఫ్‌గా అఖిలేశ్‌ను తప్పించిన ములాయం.. శివ్‌పాల్‌కు బాధ్యతలు అప్పగించటంతో వివాదం మొదలైంది. అఖిలేశ్‌కు అనుకూలంగా ఉన్న కొందరు యువనేతల్నీ ములాయం పార్టీ పదవుల నుంచి తప్పించారు. దీనికితోడు గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ నేతృత్వంలోని ఖ్వామీ ఏక్తా దళ్‌ను ఎస్పీలో విలీనం చేసే ప్రయత్నాన్నీ అఖిలేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణాలన్నీ యాదవ కుటుంబంలో ముసలానికి కారణమయ్యాయి. సయోధ్యకోసం ములాయంతోపాటు.. పార్టీ సీనియర్ నేతలైన బేణీ ప్రసాద్‌వర్మ, మరికొందరు ప్రయత్నించినా ప్రభావం కనిపించలేదు. చీలిన కుటుంబం.. ఈ నేపథ్యంలోనే.. ఇన్నాళ్లుగా ఒకచోటే కలసి ఉంటున్న యాదవ్ కుటుంబం నుంచి బయటపడ్డ అఖిలేశ్ వేరు కుంపటి పెట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి మకాం మార్చారు. దీనికి అఖిలేశ్ పినతల్లి (ములాయం రెండో భార్య) కారణమంటూ సీఎం వర్గం ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ వ్యాఖ్యానించటం.. ఆయన్ను పార్టీనుంచి ములాయం బహిష్కరించటం చకచకా జరిగిపోయాయి. ఇది జరిగిన రెండ్రోజుల్లోనే అమర్‌సింగ్ అనుకూలురుగా పేరున్న ముగ్గురు మంత్రులను సీఎం తొలగించటం, దేనికైనా సిద్ధమనే ధోరణిలో కనిపించటం సమాజ్‌వాదీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలనిస్తోంది. -
త్వరలో అఖిలేశ్ కొత్త పార్టీ?
ఎస్పీ కీలక భేటీకి సీఎం డుమ్మాతో బలపడుతున్న అనుమానాలు లక్నో: యూపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార సమాజ్‌వాదీ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించటం, బాబాయ్ శివ్‌పాల్‌తో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్పీలో చీలిక తప్పదని.. త్వరలోనే ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్‌వాద్ పార్టీ’ పేరుతో కొత్త కుంపటి పెట్టేందుకు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగానే అంతా పూర్తి చేసి మోటార్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మొన్నటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న యాదవ్ ఫ్యామిలీ నుంచి విడిపోయిన అఖిలేశ్.. ఇటీవలే సీఎం అధికారిక నివాసానికి మకాం మార్చారు. నవంబర్ 5న పార్టీ రజతోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే.. 3నుంచి ‘వికాస్ రథయాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. ఇవన్నీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలను బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎస్పీ ముఖ్యనేతలతో శుక్రవారం జరిగిన సమావేశానికి అఖిలేశ్ గైర్హాజరయ్యారు. ఈ భేటీ పూర్తయ్యాక ఆ నాయకులతోనే సీఎం తన నివాసంలో వేరుగా సమావేశమై నవంబర్ 3నుంచి జరగనున్న ‘వికాస్ రథయాత్ర’ గురించి మాట్లాడారు. అఖిలేశ్ కొత్త పార్టీ యత్నాలపై వార్తల నేపథ్యంలో.. ఎస్పీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. అఖిలేశ్ సీఎం అవుతారని శివ్‌పాల్ శుక్రవారం తెలిపారు. -
'దావూద్ తో మోదీ భేటీ'పై రగడ
లక్నో: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను ప్రధాని మోదీ కలిశారన్న యూపీ మంత్రి అజాం ఖాన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. డాన్ తో ప్రధాని భేటీ నిజమని నిరూపించాలని, లేదంటే ఆజాం ఖాన్ ను వెంటనే మంత్రి పదవినుంచి తొలిగించాలని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను డిమాండ్ చేశారు. మంగళవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన పాఠక్.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రి ఆజం ఖాన్ ను సమాజ్ వాదీ పార్టీ అధినాయకత్వం వెనకేసుకురావటం విడ్డూరంగా ఉందన్నారు. గతేడాది చివర్లో అకస్మాత్తుగా లాహోర్ (పాకిస్థాన్) వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. నవాజ్ షరీఫ్ నివాసంలోనే మాఫియా డాన్ దావూద్ ను కలుసుకున్నారని మంత్రి ఆజం ఖాన్ రెండు రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓసారి ములాయం పుట్టినరోజు వేడుకలకు దావూద్ డబ్బు పంపినట్లు ఆజాం చెప్పిన మాటలను ఉటంకించిన బీజేపీ యూపీ చీఫ్.. పిచ్చివాగుళ్లు కట్టిపెట్టాలని ఘాటుగా హెచ్చరించారు.