ఢీ అంటే ‘డీ’
డెవలప్‌మెంట్ వర్సెస్ డీమానిటైజేషన్‌గా మారిన యూపీ ఎన్నికలు
- అభివృద్ధి అస్త్రంతో అఖిలేశ్.. నోట్లరద్దు లాభాలతో మోదీ
- రెండునెలలుగా జోరుగా అఖిలేశ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- అమిత్ షా నేతృత్వంలో ‘కమల్ ఖిలావో’ ప్రచారం
దేశంలో జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. అభివృద్ధి మంత్రంతో మళ్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని సీఎం అఖిలేశ్ వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో మోదీ నోట్లరద్దు (డీమానిటైజేషన్), అఖిలేశ్ అభివృద్ధి (డెవలప్‌మెంట్) మధ్యే యూపీ ఎన్నికల ప్రచారం ప్రస్తుతానికి జోరుగా సాగుతోంది.
2 నెలలుగా అఖిలేశ్ బిజీ.. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా 71 ఎంపీ సీట్లు (యూపీ నుంచి) గెలుచుకున్న బీజేపీని నిలువరించేందుకు అఖిలేశ్ అన్ని మార్గాలను వెతుకుతున్నారు. యాదవ్ కుటుంబంలో గొడవలు, యూపీలో శాంతిభద్రతలపై అసంతృప్తి, సామాన్యులకు రక్షణ కరువైందన్న విమర్శల నేపథ్యంలో.. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే.. నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రచారం చేసుకుంటున్నారు. రెండు నెలలుగా కేవలం గతంలో చేసిన పనులను ప్రారంభించేందుకే సీఎం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. లక్నో మెట్రో రైలు ట్రయల్ రన్ నిర్వహించటంతోపాటు 302 కి.మీ. పొడవైన ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వేనూ అఖిలేశ్ ప్రారంభించారు. బీజేపీ జోరును అడ్డుకునేందుకు నోట్లరద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశాన్నీ పదే పదే ప్రస్తావిస్తున్నారు.
మోదీపైనే కమలం భరోసా
నోట్లరద్దుతో నల్లధనం, అవినీతిని పెకిలించి వేయొచ్చని.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ప్రధాని యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలనూ అడ్డుకోవటం ద్వారా విపక్షాలు.. అవినీతి, నల్లధనానికి మద్దతుగా నిలుస్తున్నాయని ప్రజావేదికలపై చెబుతున్నారు. యూపీలో అధికారంలో ఉన్న ఎస్పీ, అంతకుముందు బీఎస్పీ అవినీతిలో కూరుకుపోయి అభివృద్ధిని మరిచిపోయాయని విమర్శిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారానే విపక్షాలను ఇరకాటంలో పెట్టాలని యూపీ బీజేపీ నేతలకు మోదీ సూచిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ వీలైనన్ని మార్గాలను వెతుకుతోంది.
పార్టీ చీఫ్ అమిత్ షా దగ్గరుండి మరీ ‘కమల్ ఖిలావో’(కమల వికాసం) ప్రచారానికి మార్గదర్శనం చేస్తున్నారు. అయితే.. నోట్లరద్దుపై క్షేత్రస్థాయిలో అనుకూలంగా లేదని యూపీ బీజేపీ నేతలంటున్నారు. మోదీ నిర్ణయంపై వ్యతిరేకత లేకపోయినా.. అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల అసంతృప్తి ఉందంటున్నారు. అయితే.. మోదీ ప్రచారం వల్ల రానున్న రోజుల్లో సానుకూల వాతావరణం ఏర్పడొచ్చన్నారు. దీంతోపాటు ఎస్పీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన కార్యక్రమాలన్నీ అసంపూర్తిగా మిగిలాయని, వీటి గురించి ప్రజలకు చెబుతామంటున్నారు. బీఎస్పీ కూడా అఖిలేశ్ ప్రభుత్వం చేసిన అసంపూర్తి పనులపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మోదీపైనా నోట్లరద్దు సమస్యల ప్రభావం తప్పదని బీఎస్పీ చీఫ్ మాయావతి చెబుతున్నారు. అయితే.. ఎన్నికల సంఘం ఒక్కసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారే అవకాశమూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్