త్వరలో అఖిలేశ్ కొత్త పార్టీ?
ఎస్పీ కీలక భేటీకి సీఎం డుమ్మాతో బలపడుతున్న అనుమానాలు
లక్నో: యూపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార సమాజ్‌వాదీ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించటం, బాబాయ్ శివ్‌పాల్‌తో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్పీలో చీలిక తప్పదని.. త్వరలోనే ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్‌వాద్ పార్టీ’ పేరుతో కొత్త కుంపటి పెట్టేందుకు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగానే అంతా పూర్తి చేసి మోటార్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
మొన్నటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న యాదవ్ ఫ్యామిలీ నుంచి విడిపోయిన అఖిలేశ్.. ఇటీవలే సీఎం అధికారిక నివాసానికి మకాం మార్చారు. నవంబర్ 5న పార్టీ రజతోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే.. 3నుంచి ‘వికాస్ రథయాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. ఇవన్నీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలను బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎస్పీ ముఖ్యనేతలతో శుక్రవారం జరిగిన సమావేశానికి అఖిలేశ్ గైర్హాజరయ్యారు. ఈ భేటీ పూర్తయ్యాక ఆ నాయకులతోనే సీఎం తన నివాసంలో వేరుగా సమావేశమై నవంబర్ 3నుంచి జరగనున్న ‘వికాస్ రథయాత్ర’ గురించి మాట్లాడారు. అఖిలేశ్ కొత్త పార్టీ యత్నాలపై వార్తల నేపథ్యంలో.. ఎస్పీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. అఖిలేశ్ సీఎం అవుతారని శివ్‌పాల్ శుక్రవారం తెలిపారు.